తెలంగాణలో ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్న నిరుద్యోగుల కోసం.. త్వరలో నోటిఫికేషన్లు విడుదల చేయనుంది ప్రభుత్వం. ఇందులో ఉపాధ్యాయు పోస్టులు కూడా ఎక్కువగా ఉండటంతో డీఎస్సీ అభ్యర్థులు ప్రిపరేషన్‌లో పడిపోయారు. అయితే.. టెట్ విషయంలోనే కాస్త గందరగోళం నెలకొంది. బీఈడీ పూర్తిచేసిన బయాలజీ, లాంగ్వేజ్ పండిట్లు.. టెట్‌ని తలుచుకుని ఆందోళన చెందుతున్నారు. వారి ఆందోళనకు కారణమేంటి?
ఓవైపు నోటిఫికేషన్లు వస్తున్నాయన్న ఆనందం ఉన్నా.. కొందరు అభ్యర్థుల్లో మాత్రం ఆందోళన నెలకొంది. ఇంటర్, డిగ్రీలో బయాలజీ చదివిన వారికి.. ఇప్పుడు గుండె దడ మొదలైంది. ఏ మాత్రం చదవని, అవగాహన లేని సబ్జెక్టులపై ప్రశ్నలు ఇస్తోండటంతో ఏం చేయాలో తెలియక కలవరపడుతున్నారు. ఎలా ప్రిపేరవ్వాలో తెలియక సతమతమవుతున్నారు. తెలంగాణ వచ్చిన తర్వాత రెండు సార్లు టెట్ నిర్వహించారు. చివరి సారిగా 2017లో టెట్ ఎగ్జామ్ జరిగింది. SGTలకు పేపర్-1, స్కూల్ అసిస్టెంట్లకు పేపర్-2 నిర్వహిస్తారు. జాతీయ ఆదేశాల ప్రకారం ఈసారి పేపర్-1కు డీఈడీ అభ్యర్థులతోపాటు బీఈడీ పూర్తిచేసిన వారికీ అర్హత కల్పించాల్సి ఉంటుంది. టెట్ మొత్తం 150 మార్కులకు నిర్వహిస్తే… ఓసీలకు 60 శాతం, బీసీలకు 50, ఎస్సీ, ఎస్టీలకు 40 శాతం మార్కులని… అర్హత మార్కులుగా నిర్థారించారు. టెట్‌లో కనీస మార్కులు సాధిస్తేనే డీఎస్సీ పరీక్ష రాయడానికి వీలవుతుంది.
రాష్ట్రంలో డీఈడీ పూర్తిచేసిన వారు లక్షా 50 వేల మంది, బీఈడీ అభ్యర్థులు మూడు లక్షల వరకు ఉన్నట్టు అంచనా. గతంలో టెట్ అర్హత సాధించని వారికి, 2017 తర్వాత బీఈడీ పాసైన బయాలజీ, లాంగ్వేజ్ పండిట్లకు ఇప్పుడీ పరీక్ష తలనొప్పిగా మారింది. డిగ్రీలో బయాలజీ చదివిన అభ్యర్థులు స్కూల్ అసిస్టెంట్ కావాలంటే… వారు చదివిన సిలబస్ నుంచి కాకుండా… మాథ్స్, ఫిజిక్స్ నుంచి ఎక్కువ ప్రశ్నలు అడుగుతున్నారు. దీంతో లాంగ్వేజ్ పండిట్లో టెన్షన్ ఎక్కువగా ఉంది. వారికి మాథ్స్, ఫిజిక్స్ అసలు టచ్ లేకపోవడంతో ఇబ్బంది పడుతున్నారు.
టెట్‌లో అభ్యర్థులు ఎలిజిబుల్ కావాలంటే 90శాతానికిపైగా మార్కులు సాధించాల్సి వస్తుంది. ఇది ఎలా సాధ్యం అనేది బయాలజీ అభ్యర్థుల ప్రశ్న. ఎంపీసీ అభ్యర్థుల మాదిరి తమకు కూడా బయాలజీ నుంచి ఎక్కువ క్వశ్చన్స్ వస్తేనే అర్హత సాధించగలమంటున్నారు. ఈ విషయంలో ప్రభుత్వం స్పష్టతనిస్తే గందరగోళం లేకుండా ప్రిపేరయ్యే అవకాశం ఉంటుందని ప్రభుత్వాన్ని కోరుతున్నారు.
