Site icon NTV Telugu

Tarun Chugh: కేసీఆర్‌కు తరుణ్ చుగ్ సవాల్.. ఆ చర్చకు సిద్ధమా?

Tarun Chugh To Kcr

Tarun Chugh To Kcr

Tarun Chugh Open Challenge To CM KCR Over Central Funds: తెలంగాణ సీఎం కేసీఆర్‌కు బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, రాష్ట్ర ఇన్‌చార్జ్ తరుణ్ చుగ్ ఓ సవాల్ విసిరారు. కేసీఆర్ కేంద్రమంత్రిగా ఉన్నప్పుడు రాష్ట్రానికి వచ్చిన నిధులు, 2014 తర్వాత వచ్చిన నిధులపై బహిరంగ చర్చకు రావాలని డిమాండ్ చేశారు. అసలు ఎరువుల ఫ్యాక్టరీని తెరవడాన్ని కేసీఆర్ ఎందుకు వ్యతిరేకిస్తున్నారని ప్రశ్నించారు. ఈ కర్మాగారం వల్ల ఒక్క తెలంగాణ రైతులకే కాకుండా.. యావత్ దేశానికి విశేష ప్రయోజనం కలుగుతుందన్నారు. గత ప్రభుత్వాల నిర్వాకం వల్ల మూతపడ్డ ఎరువుల కర్మాగారాన్ని పునరుద్ధరించి.. జాతికి అంకితమిచ్చేందుకే నవంబర్ 12న ప్రధాని మోడీ రామగుండంకు వస్తున్నారన్నారు. కానీ.. సీఎం కేసీఆర్ తన కొత్తు మిత్రులైన సీపీఐ, సీపీఎంలతో కలిసి మోడీ పర్యటనకు సమస్యలు సృష్టించేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపణలు చేశారు.

ఎరువుల ఫ్యాక్టరీపై కేసీఆర్ అసత్యాలు ప్రచారం చేస్తున్నారని.. అయితే కేసీఆర్ ఎన్ని అబద్ధాలు చెప్పినా, విజ్ఞత గల తెలంగాణ ప్రజలు వాటిని నమ్మబోరని తరుణ్ చుగ్ పేర్కొన్నారు. కేసీఆర్ కేంద్రమంత్రిగా ఉన్నప్పుడే ఈ ఫ్యాక్టరీ మూతపడిన విషయం గుర్తించాలన్నారు. ఈ ఫ్యాక్టరీని తెరిపించేందుకు కేసీఆర్ గానీ, ఆయన మంత్రిగా ప్రాతినిధ్యం వహించిన ప్రభుత్వం గానీ ఏమీ చేయలేదన్నారు. ఇప్పుడు ప్రధాని మోడీ చొరవ తీసుకుని.. రూ. 6,500 కోట్లతో ఈ ఫ్యాక్టరీని పునరుద్ధరిస్తున్నారన్నారు. తెలంగాణకు కేంద్రప్రభుత్వం ఏం చేయలేదని కేసీఆర్ చెప్తున్నారని.. 2014లో తెలంగాణ ఏర్పడే సమయానికి రాష్ట్రంలో జాతీయ రహదారుల మొత్తం నిడివి 2,511 కిలోమీటర్లు ఉండగా, ఇప్పుడు ఆ సంఖ్య 4,996 కిలోమీటర్లకు పెరిగిందన్నారు. రాష్ట్రంలో జాతీయ రహదారుల నిడివిలో 99 శాతం వృద్ధి నమోదైందని వివరించారు. అలాగే.. హైదరాబాద్‌లో ట్రాఫిక్ సమస్యను పరిష్కరించేందుకు అంబర్‌పేట్ వద్ద రూ.186.71 కోట్లతో 4-లేన్ ఫ్లైఓవర్‌ను.. దాంతో పాటు దాంతోపాటు ఉప్పల్ నుండి నారపల్లి వరకు రూ.628.8 కోట్లతో ఎలివేటెడ్ కారిడార్‌ కేంద్ర ప్రభుత్వం నిర్మిస్తోందన్నారు.

రైల్వేల్లో కూడా తెలంగాణకు కేంద్రం కేటాయింపులు భారీగా పెరిగాయని తరుణ్ చుగ్ వెల్లడించారు. 2014-19 మధ్య కాలంలో ప్రతీ సంవత్సరం సగటున రూ.1,110 కోట్ల కేటాయింపులు జరిగాయన్నారు. కేంద్రం రూ.4,200 కోట్లతో పలు అభివృద్ధి పనులు చేపట్టినా.. రాష్ట్ర ప్రభుత్వం మాత్రం తన వాటాగా ఇవ్వాల్సిన రూ. 699 కోట్లు చెల్లించడం లేదన్నారు. మోడీ అధికారంలోకి వచ్చాక.. తెలంగాణలో రూ.31,281 కోట్ల విలువ గల పలు ప్రాజెక్టులను రైల్వేశాఖ చేపట్టిందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేసే ప్రతి కార్యక్రమంలోనూ కేంద్రం భాగస్వామ్యం ఉందన్నారు. తెలంగాణలో రోజురోజుకు ప్రాబల్యాన్ని కేసీఆర్ కోల్పోతున్నారని.. మునుగోడులో ఆశించిన మెజారిటీ దక్కకపోవడంతో, రానున్న ఎన్నికల్లో ఓటమి తప్పదన్న ఆందోళణలో ఆయన కూరుకుపోయారని తరుణ్ చుగ్ చెప్పారు.

Exit mobile version