Tammineni Veerabhadram Sensational Comments On BJP: టీఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి నామినేషన్ ర్యాలీలో సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం బీజేపీపై సంచలన వ్యాఖ్యలు చేశారు. బిజెపి ఒక సాదాసీదా పార్టీ కాదని.. బీజేపీని ఆర్ఎస్ఎస్ అనే ఓ ప్రమాదకరమైన సంస్థ నడిపిస్తోందని ఆరోపించారు. అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని సమూలంగా మార్చాలని బిజెపి భావిస్తోందన్నారు. ప్రభుత్వ రంగ సంస్థలను కారుచౌకగా కార్పొరేట్లకు బీజేపీ కట్టబెడుతోందని వ్యాఖ్యానించారు. బిజెపి గెలిస్తే.. మోటార్లకు మీటర్లు పెడతారన్నారన్నారు. కారు గుర్తుకు ఓటు వేసి టీఆర్ఎస్‌ను గెలిపించాలని.. రాజగోపాల్ రెడ్డిని చిత్తు చిత్తుగా ఓడించాలని మునుగోడు ప్రజల్ని కోరారు.
ఇదే ర్యాలీలో పాల్గొన్న సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనమనేని సాంబశివరావు కూడా బీజేపీపై ధ్వజమెత్తారు. బిజెపి కరోనా కంటే ప్రమాదమని.. డాఫర్, 420, డెకైట్ అందరూ కలిసి బీజేపీ రూపంలో మునుగోడుకు వస్తున్నారని ఆరోపణలు చేశారు. తెలంగాణా బిల్లు, విభజన హామీలను గాలికి వదిలేశారన్నారు. కేసీఆర్ లాంటి నాయకులు కావాలని దేశం కోరుకుంటోందని.. ఈడీలు వచ్చినా, ఇంకెవరు వచ్చినా కేసీఆర్ బక్కప్రాణాన్ని ఏం చేయలేరని తేల్చి చెప్పారు. రాజగోపాల్ రెడ్డిని రాజకీయంగా సమాధి చేయాలని.. తెలంగాణ సమాజం కోసం టీఆర్ఎస్‌కు ఓటు వేసి గెలిపించాలని కోరారు. మునుగోడులో గెలిచేది టిఆర్ఎస్ పార్టీనే.. టిఆర్ఎస్‌ను గెలిపించేందుకే తాము వచ్చామని పేర్కొన్నారు.
టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ సైతం రాజగోపాల్ రెడ్డిపై విరుచుకుపడ్డారు. 18 వేల కోట్లకు రాజగోపాల్ రెడ్డిని బీజేపీ కొనేసిందని, కాంట్రాక్ట్ డబ్బులతో మునుగోడు ప్రజల్ని అంగడి సరుకులా కొనడానికి వచ్చారని విమర్శించారు. నియోజకవర్గంలో రాజగోపాల్ రెడ్డి నాలుగేళ్లుగా కనిపించలేదన్నారు. ఒక్కో ఓటును తాను డబ్బు పెట్టి కొంటానని రాజగోపాల్ రెడ్డి అంటున్నారని కేటీఆర్ తెలిపారు. ఇది ప్రజలపై బలవంతంగా రుద్దిన ఎన్నిక అని, టీఆర్ఎస్ అభ్యర్థిని గెలిపిస్తే తానే మునుగోడును దత్తత తీసుకుంటానని కేటీఆర్ మాటిచ్చారు.
