Site icon NTV Telugu

Tammineni Veerabhadram: బీఆర్ఎస్‌తో పొత్తుల అంశం చర్చించలేదు.. అవన్నీ ఊహాగానాలే

Tammineni Veerabhadram

Tammineni Veerabhadram

Tammineni Veerabhadram Gives Clarity on Alliance With BRS Party: బీఆర్ఎస్ పార్టీతో పొత్తుల అంశం ఇంకా చర్చించలేదని, సీట్ల విషయంలో జరుగుతున్న ప్రచారాలన్నీ ఊహాగానాలేనని సీపీఎం పార్టీ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం స్పష్టం చేశారు. మీడియాతో మాట్లాడిన ఆయన.. తనకు పాలేరు నుంచి పోటీ చేయాలని ఉద్దేశం ఏమాత్రం లేదని తేల్చి చెప్పారు. ఎన్నికల సమయానికి తాము పొత్తుల విషయాన్ని ప్రకటిస్తామన్నారు. ప్రస్తుతం ప్రజా సమస్యలపై పోరాటం కొనసాగుతోందన్నారు. రాష్ట్రంలో రోజురోజుకి బీజేపీ పార్టీ బలపడుతున్న మాట వాస్తవమేనన్న ఆయన.. కాంగ్రెస్ పార్టీ మాత్రం బలహీనపడుతోందన్నారు. కాంగ్రెస్‌లో ఉన్న కీలక నేతలు బీజేపీలోకి వెళ్లే ప్రయత్నం చేస్తున్నారన్నారు. ఒక్క తెలంగాణలోనే కాదు, దేశవ్యాప్తంగా కాంగ్రెస్ బలహీన పడుతోందని చెప్పారు. జాతీయ స్థాయిలో బీజేపీని ఎదుర్కొనే సరైన ఆయుధం కాంగ్రెస్‌కు లేదన్నారు. బీజేపీ హిందుత్వ ఎజెండాతో బలంగా ముందుకు వెళ్లే ప్రయత్నం చేస్తోందన్నారు. బీజేపీని తెలంగాణలో ఎంట్రీ ఇవ్వకుండా చేయాల్సిన ప్రయత్నాలన్నీ తాము చేస్తామన్నారు.

అంతకుముందు.. మతోన్మాద బీజేపీకి వ్యతిరేకంగా తాము బీఆర్ఎస్‌తో కలిసి పోరాడుతామని తమ్మినేని వీరభద్రం ప్రకటించారు. దేశంలో బీజేపీ ప్రభుత్వం దుర్మార్గంగా వ్యవహరిస్తూ, ప్రలోభాలకు గురిచేస్తూ, ఇతర పార్టీలను తమ పార్టీలో కలుపుకుంటోందని దుయ్యబట్టారు. బీజేపీ విధానాలను ఎండగట్టిన ఆయా రాష్ట్ర ప్రభుత్వాలపై ఉసిగొల్పుతోందని.. బీజేపీ ప్రజా వ్యతిరేక విధానాలపై సీఎం కేసీఆర్‌ ధీటుగా పోరాటాలు చేస్తున్నందుకే ఆయనతో కలిసి మునుగోడు ఉప ఎన్నికల్లో పని చేశామని తెలిపారు. భవిష్యత్‌లోనూ బీఆర్‌ఎస్‌తో కలిసి పని చేస్తామన్నారు. తొలుత కేసీఆర్ ఏడేళ్లపాటు బీజేపీతో సఖ్యతతో ఉన్నారని.. కానీ ఆ పార్టీ ఇప్పుడు తెలంగాణలో అధికారం కోసం ప్రయత్నాలు చేస్తుండటంతో బీజేపీకి వ్యతిరేకంగా పోరాడుతున్నారన్నారు. ప్రధాని మోడీకి అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు భయపడుతున్నారని.. ఏపీ సీఎం జగన్‌పై కేసులు ఉండటంతో ఆయన మరీ భయపడుతున్నారని వ్యాఖ్యానించారు.

Exit mobile version