Tammineni Veerabhadram Fires On BJP: సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం బీజేపీపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. బీజేపీ ఒక సాదాసీదా రాజకీయ పార్టీ కాదని, అదొక పాపిస్ట్ పార్టీ అని ఆరోపణలు చేశారు. మునుగోడు ఎన్నికకు సంబంధించి తెలంగాణకు పెద్ద ఎన్నిక అని.. కాంగ్రెస్ పార్టీని దెబ్బ తీయాలని బీజేపీ కుట్ర పన్నిందని పేర్కొన్నారు. తమది హిందూ పార్టీ అంటూ చెప్పుకుని తిరిగే బీజేపీ అసలు హిందూ పార్టీ కాదని.. హిందువుల్లో అతికొద్దిమంది మాత్రమే ఉన్న పార్టీ అని ఎద్దేవా చేశారు. ప్రజలు అభివృద్ధి చెందాలన్న ఉద్దేశం బీజేపీకి ఏమాత్రం లేదని.. మనుధర్మని కొనసాగాలని ఆ పార్టీ నేతలు కోరుకుంటున్నారని అన్నారు.
ఎమ్మెల్యేలను కొనడంతో పాటు ప్రభుత్వం రంగ సంస్థల్ని బీజేపీ అమ్మేస్తోందని.. సౌత్, నార్త్ ప్రాంతాలని తాకట్టు పెట్టేస్తోందని తమ్మినేని ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యుత్ చట్టం, నల్ల చట్టాలు తీసుకొచ్చి.. బీజేపీ రైతుల నడ్డి విరుస్తోందని ఫైర్ అయ్యారు. టీఆర్ఎస్‌తో కలిసి పోరాడాలని తాము తీసుకున్న నిర్ణయం నూటికి నూరు శాతం సరైనదేనని తెలిపారు. కాంగ్రెస్ నాశనం అయ్యిందని బీజేపీలోని కొందరు నేతలు సంతోషిస్తున్నారన్నారు. బీజేపీ ప్రజా వ్యతిరేఖ విధానాలను తాము కచ్ఛితంగా ఎదుర్కుంటామని తేల్చి చెప్పారు. ఇక గవర్నర్ వ్యవస్థ చాలా దుర్మార్గంగా ఉందని ధ్వజమెత్తారు. కేరళ, తెలంగాణ గవర్నర్‌లు సొంత అజెండా అమలు చేస్తున్నారన్నారు.
ఇదే సమయంలో సీపీఎం నేత జూలకంటి రంగారెడ్డి మాట్లాడుతూ.. మునుగోడు ప్రజలు తెలివైన తీర్పునిచ్చారన్నారు. మునుగోడు ఉపఎన్నికను బీజేపీ కావాలని తీసుకువచ్చిందన్నారు. కుట్రపూరితంగా ఎన్నిక తీసుకువచ్చి, గెలవాలని కుట్ర పన్నారన్నారు. ఇక ఈ ఎన్నికల్లో గెలుపొందిన కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి.. సీపీఐ, సీపీఎం పెద్దలకు కృతజ్ఞతలు తెలిపారు. మునుగోడుని అందరి సహకారంతో అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తానన్నారు. ఆ ప్రాంత ప్రజల ఆత్మ గౌరవాన్ని కాపాడుకుంటామని హామీ ఇచ్చారు.
మంత్రి జగదీశ్ రెడ్డి కూడా వామపక్ష పార్టీలకు ధన్యావాదాలు తెలుపుతూ.. బీజేపీపై విరుచుకుపడ్డారు. దేశాన్ని మరోసారి వెనక్కి తీసుకుపోయేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందని, దానికి వ్యతిరేకంగా కేసీఆర్ పోరాడుతున్నారని నమ్మి వామపక్ష పార్టీలు ముందుకొచ్చాయని అన్నారు. ఈ ఐక్యత ఇలానే కొనసాగాలని, కొత్త అభివృద్ధి పథంలో సాగాలని కోరుకున్నారు. మరోసారి బీజేపీ అధికారంలోకి వస్తే.. అక్రమ పద్దతులు ద్వారా అన్ని రాష్ట్రాల్లో అధికారంలోకి వస్తారన్నారు. తెలంగాణలో ప్రభుత్వాన్ని అస్థిర పరచాలని చూస్తున్నారని, ఇకపై కూడా ప్రజా సమస్యలపై తప్పకుండా కలసి పని చేస్తామని మాటిచ్చారు.