తెలంగాణ కాంగ్రెస్‌లో వార్ కంటిన్యూ అవుతూ ఉంది. దళిత గిరిజన దండోరా సభ వేదికపై పార్టీలోనే రచ్చ జరుగుతోంది. ఇంద్రవెల్లి సభ జోష్ లో.. ఇబ్రహీంపట్నంలో దళిత గిరిజన దండోరా సభను ప్రకటించారు పిసిసి చీఫ్ రేవంత్. అక్కడే హస్తంపార్టీలో పంచాయతీ మొదలైంది. ఇబ్రహీంపట్నం భువనగిరి పార్లమెంట్ నియోజకవర్గంలో ఉంది. పిసిసి చీఫ్ ఎవరిని అడిగి ఈ సభను ప్రకటించారని కోమటిరెడ్డి… అటు వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి గుర్రుగా ఉన్నారు. స్థానిక ఎంపి సభకు రాకుంటే సభతో వచ్చే మైలేజీ కంటే డ్యామేజ్ ఎక్కువ అవుతుంది అనే టాక్ కూడా మొదలైంది. అయితే పార్లమెంటరీ కమిటీ పర్యటన ఉన్నందున ఈనెల 18న నిర్వహించనున్న సభకు హాజరుకాలేనని కోమటిరెడ్డి తెలియజేశారు.
21వ తేదీ తర్వాత సభ ఎప్పుడు పెట్టినా హాజరయ్యేందుకు అభ్యంతరం లేదని స్పష్టం చేశారు. అయితే ఇబ్రహీంపట్నం సభ కు పోలీసులు అనుమతి కూడా నిరాకరించారు. సభ ప్రధాన రహదారికి పక్కనే ఉండటంతో ట్రాఫిక్ జాం అవుతుందనే కారణంతో సభ కు అనుమతి నిరాకరించారు. ఇబ్రహంపట్నం సభకు అనుమతి రాకపోవడం… దీనికి తోడు కోమటిరెడ్డి వ్యవహారం కూడా సెట్ అవ్వకపోవడంతో… పిసిసి తన ప్లాన్ మార్చుకుంది. సభను… భువనగిరి పార్లమెంట్ నియోజకవర్గం నుంచి..చేవెళ్ల నియోజకవర్గానికి మార్చేశారు.
మహేశ్వరం నియోజకవర్గంలో సభ ఏర్పాటుకు సిద్ధమయ్యారు. చేవెళ్ల పార్లమెంట్ ఇంఛార్జి మహేశ్వర్ గౌడ్ కూడా రేవంత్ ఆలోచన కు అనుగుణంగా ఉండే వ్యక్తి కావడంతో.. టీ-పీసీసీ ఈ నిర్ణయం తీసుకుంది. ఈ నెల 18న దళిత గిరిజన దండోరా సభ జరగనుంది. మొత్తానికి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తన పంతం నెగ్గించుకావాలని చూశారు. ఇటు రేవంత్ రెడ్డి తన నిర్ణయించిన తేదీకి సభ జరిగి తీరాలనుకున్నారు. మొత్తానికి ఇబ్రహీం పట్నం సభకు అనుమతి నిరాకరించి.. ఇద్దరి పంతాన్ని పోలీసులే తీర్చినట్టు అయ్యింది.
