NTV Telugu Site icon

అమెరికాలో రోడ్డుప్రమాదం.. సూర్యాపేట వాసి మృతి

అమెరికాలో జరిగిన ఓ రోడ్డుప్రమాదంలో సూర్యాపేట వాసి మృతి చెందాడు. దీంతో సూర్యాపేట పట్టణంలో విషాదం నెలకొంది. అమెరికాలోని ఒహయో స్టేట్‌ ప్రాంతంలో జాబ్ చేస్తున్న సూర్యాపేట వాసి చిరుసాయి ఉద్యోగం అయిపోగానే కారులో రూమ్‌కు వెళ్తున్న సమయంలో టిప్పర్ ఢీకొట్టింది. దీంతో అక్కడికక్కడే చిరుసాయి ప్రాణాలు కోల్పోయాడు. ఈ ప్రమాదంలో చిరుసాయితో ప్రయాణిస్తున్న మరో వ్యక్తి కోమాలోకి వెళ్లిపోయాడు.

Read Also: న్యూ ట్రెండ్… సైకిల్‌పై పెళ్లి మండపానికి వెళ్లిన హైదరాబాదీ వరుడు

అయితే ఈ రోడ్డుప్రమాదానికి మంచు కారణమని తెలుస్తోంది. తీవ్రంగా మంచు కురుస్తున్న సమయంలో వేగంగా వచ్చిన టిప్పర్ చిరుసాయి ప్రయాణిస్తున్న కారును ఢీకొట్టినట్లు అమెరికా అధికారులు వెల్లడించారు. కాగా అమెరికాలో మరణించిన చిరుసాయి మృతదేహాన్ని భారత్‌కు తీసుకొచ్చేందుకు కుటుంబసభ్యులు ప్రయత్నిస్తున్నారు. ఈ నేపథ్యంలో బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు సంకినేని వెంకటేశ్వరరావు, బీజేవైఎం రాష్ట్ర అధికార ప్రతినిధి సంకినేని వరుణ్ రావు సూర్యాపేటలో మృతుడి కుటుంబసభ్యులను పరామర్శించి భరోసా కల్పించారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డితో మాట్లాడి చిరుసాయి డెడ్ బాడీని ఇండియాకు తీసుకొస్తామని హామీ ఇచ్చారు.