Phone Tapping : రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేపిన తెలంగాణ ఫోన్ ట్యాపింగ్ కేసులో సుప్రీంకోర్టు కీలక నిర్ణయం వెలువరించింది. ఈ కేసులో ప్రధాన నిందితుడు, మాజీ డీఎస్పీ ప్రభాకర్ రావు సిట్ అధికారులు కోరిన సమాచారాన్ని తప్పనిసరిగా అందించాలంటూ సుప్రీంకోర్టు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. జస్టిస్ నాగరత్న ధర్మాసనం ఈ ఆదేశాలను జారీ చేస్తూ, “దర్యాప్తు ప్రక్రియలో సహకరించడం ప్రతి నిందితుడి బాధ్యత. సిట్ అడిగిన వివరాలు ఇవ్వకపోవడం చట్టవిరుద్ధం,” అని వ్యాఖ్యానించింది. ముఖ్యంగా ప్రభాకర్ రావు తన క్లౌడ్ డేటా, అలాగే యాపిల్ క్లౌడ్‌లో ఉన్న సమాచారం మొత్తం సిట్‌కు అందించాలన్నది కోర్టు స్పష్టం చేసింది.
బెంగాల్ గ్యాంగ్ రేప్ ఘటనలో బయటపడ్డ షాకింగ్ నిజాలు..
అదేవిధంగా, ఆన్‌లైన్ ఖాతాలకు సంబంధించిన యూజర్‌నేమ్, పాస్‌వర్డ్‌లు కూడా సిట్ అధికారులు పొందేలా చేయాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. అయితే, ఆ సమాచారం సేకరణ సమయంలో ఫోరెన్సిక్ నిపుణులు తప్పనిసరిగా హాజరై ఉండాలని కూడా కోర్టు సూచించింది. ఇది దర్యాప్తు పారదర్శకతను నిర్ధారించడమేనని పేర్కొంది. తద్వారా, సిట్ అధికారులు ఫోరెన్సిక్ బృందం సమక్షంలో డిజిటల్ ఆధారాలను సేకరించి దర్యాప్తును కొనసాగించవచ్చు. ప్రభాకర్ రావు లేదా ఇతర నిందితులు ఆ సమాచారాన్ని చెరిపేందుకు లేదా మార్చేందుకు యత్నించినట్లు తేలితే, ఆ అంశంపై తదుపరి కఠిన చర్యలు తీసుకుంటామని సుప్రీంకోర్టు హెచ్చరించింది.
ఫోన్ ట్యాపింగ్ కేసులో ఈ తీర్పు సిట్ దర్యాప్తుకు మరింత బలం చేకూర్చనుంది. డిజిటల్ ఆధారాలు సేకరణకు సంబంధించి సుప్రీంకోర్టు ఇచ్చిన స్పష్టమైన మార్గదర్శకాలు, ఈ కేసులో కొత్త మలుపు తిప్పే అవకాశముందని న్యాయవర్గాలు అంచనా వేస్తున్నాయి. ఇక ప్రభాకర్ రావు సిట్ ఆదేశాలను పాటించి వివరాలు సమర్పిస్తారా లేదా అనే అంశం, రాబోయే రోజుల్లో ఈ కేసు దిశను నిర్ణయించనుంది.
Siddhu Jonnalagadda : ఉమెమైజర్ అన్న జర్నలిస్ట్.. చాలా డిస్‌రెస్పెక్ట్‌ఫుల్.. షాకింగ్ రియాక్షన్
