Students Damaged movie theater in hyderabad
ఇండియాకు ఇండిపెండెన్స్ డే వచ్చి 75 ఏళ్లు పూర్తయిన సందర్భంగా దేశ వ్యాప్తంగా వజ్రోత్సవాలు నడుస్తున్నాయి. ఇందులో భాగంగా ‘గాంధీ’ సినిమాను ఉచితంగా ప్రదర్శిస్తున్నారు. తెలంగాణలో విద్యార్థుల కోసం అన్ని థియేటర్లలో మార్నింగ్ షోలలో ఈ సినిమాను ప్రదర్శిస్తున్నారు. అయితే శుక్రవారం నాడు హైదరాబాద్ మల్లేపల్లిలోని ప్రియా థియేటర్‌లో గాంధీ సినిమాను చూసేందుకు మెహిదీపట్నంలోని ఎంఎస్ కాలేజీకి చెందిన 500 మంది విద్యార్థులు తరలివచ్చారు. ఈ విద్యార్థులు గాంధీగిరి చేయడంతో అందరూ ఆశ్చర్యపోయారు. అహింసా మార్గంలోనే నడవాలని గాంధీ చెప్పిన మాటలను విద్యార్థులు పెడచెవిన పెట్టి విధ్వంసం సృష్టించారు.
గాంధీ సినిమాను వీక్షిస్తున్న సమయంలో కొందరు విద్యార్థులు థియేటర్‌లోనే సీట్లు చింపి సీసీ కెమెరాలను ధ్వంసం చేశారు. థియేటర్ నిర్వాహకులు వెంటనే స్పందించి విద్యార్థులను వారించినా ఫలితం దక్కలేదు. దీంతో ప్రియా థియేటర్ మేనేజర్ మాజీద్ రజ్వీ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు థియేటర్ వద్దకు చేరుకుని విచారణ చేపట్టారు. అసలు విద్యార్థులు థియేటర్‌ను ధ్వంసం చేయాల్సిన అవసరం ఎందుకు వచ్చిందో అన్న విషయంపై పోలీసులు ఆరా తీస్తున్నారు.
