Srushti Case : సృష్టి కేసులో ప్రధాన నిందితురాలు డాక్టర్ నమ్రత కస్టడీ నేడు ముగియనుంది. కోర్టు ఐదు రోజులపాటు పోలీసు కస్టడీకి అనుమతించగా, గత నాలుగు రోజుల విచారణలో కీలక అంశాలు వెలుగులోకి వచ్చాయి.
ఒక్కొకరుగా సృష్టి టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్ బాధితులు బయటకు వస్తున్నారు. నల్గొండకు చెందిన జంట నుంచి రూ.44 లక్షలు, హైదరాబాద్‌కు చెందిన జంట నుంచి రూ.18 లక్షలు, మరో NRI జంట నుంచి రూ.25 లక్షలు వసూలు చేసినట్లు ఫిర్యాదులు నమోదయ్యాయి. ఇప్పటివరకు ఈ కేసులో నాలుగు FIRలు నమోదు కాగా, 15 మందిని పోలీసులు అరెస్టు చేశారు.
నమ్రత బినామీగా వ్యవహరించిన కీలక నిందితురాలు విద్యులతను కూడా పోలీసులు అరెస్టు చేశారు. నమ్రత కుమారుడు జయంత్ కృష్ణతో పాటు మరికొందరు నిందితులను కూడా కస్టడీకి కోరే అవకాశం ఉందని తెలుస్తోంది.
ఇప్పటివరకు ఆరెస్టైన వారి పేర్లు.. డాక్టర్ నమ్రత, జయంత్ కృష్ణ, కళ్యాణి అచ్చాయమ్మ (వైజాగ్), ల్యాబ్ టెక్నీషియన్ చెన్నారావు, గాంధీ అనస్థీషియా డాక్టర్ సదానందం, ధనశ్రీ (అస్సాం), మహమ్మద్ అలీ ఆదిక్, నస్రీన్ బేగం, విద్యులత, కృష్ణ, శేషగిరిరావు, శ్రీనివాస్, సురేఖ, నయీం దాస్, ఆశా బేగం.
