ఏపీ ప్రభుత్వంపై మరోసారి తెలంగాణ మంత్రి శ్రీనివాస్ గౌడ్ మండిపడ్డారు. శ్రీశైలం ప్రాజెక్టులో జల విద్యుత్ ఉత్పాదనను అడ్డుకునేలా ఏపీ ప్రభుత్వం కృష్ణా బోర్డుకు ఫిర్యాదు చేయడం దారుణమని మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఫైర్ అయ్యారు. శ్రీశైలం ప్రాజెక్టు బచావత్ ట్రిబ్యునల్ ప్రకారం హైడెల్ పవర్ ప్రాజెక్టేనని పేర్కొన్నారు. ఏపీ ప్రభుత్వం శ్రీశైలం హైడెల్ పవర్ పై కృష్ణా బోర్డుకు ఫిర్యాదు చేయడం పరిపాటిగా మారిందని… కృష్ణా బోర్డు అనేక అంశాల్లో చోద్యం చూస్తోందని మండిపడ్డారు.
ట్రిబ్యునల్ ఏపీ అక్రమ ప్రాజెక్టులపై స్టే విధిస్తే కృష్ణా బోర్డు ఏం చేస్తోందని..దాన్ని అమలు చేసే భాద్యత బోర్డుది కాదా ? అని ప్రశ్నించారు. మేము కడుపు మండి నిజాలు మాట్లాడితే ఏపీ నేతలకు ఉలికి పాటు ఎందుకు ? అని నిలదీశారు. కృష్ణా రివర్ బోర్డు నిష్పాక్షికంగా వ్యవహరించాలని… ఏపీ ఫిర్యాదు చేయగానే శ్రీశైలంలో జల విద్యుత్ ఆపమని కృష్ణా బోర్డు ఎలా చెబుతుంది ? అని ప్రశ్నించారు.
