Site icon NTV Telugu

Sridhar Babu : మేము ‘హైప్’ చేయడం లేదు.. నిరుద్యోగుల్లో ‘హోప్’ క్రియేట్ చేస్తున్నాం

Sridhar Babu

Sridhar Babu

తెలంగాణ వేదికగా జరిగిన గ్లోబల్ సమ్మిట్ అంతర్జాతీయ స్థాయిలో రాష్ట్ర ప్రతిష్టను పెంచిందని, ప్రపంచవ్యాప్తంగా ఉన్న పారిశ్రామికవేత్తలు ఇప్పుడు తెలంగాణ వైపు ఆసక్తిగా చూస్తున్నారని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు అన్నారు. సమ్మిట్ విజయంపై మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ చేసిన వ్యాఖ్యలను ఆయన తీవ్రంగా ఖండించారు. రాష్ట్రానికి పెట్టుబడులు, నిరుద్యోగులకు ఉద్యోగాలు రావడం కేసీఆర్‌కు ఇష్టం లేనట్లు ఆయన మాటలు ఉన్నాయని మంత్రి మండిపడ్డారు.

ఈ సమ్మిట్ ద్వారా 5 లక్షల కోట్ల రూపాయలకు పైగా పెట్టుబడులకు సంబంధించి ఎంఓయూలు (MOU) జరిగాయని, వీటిని కేసీఆర్ చాలా తేలికగా మాట్లాడటం తగదని శ్రీధర్ బాబు అన్నారు. “కేసీఆర్ హయాంలోనూ అనేక ఒప్పందాలు జరిగాయి, కానీ అన్నీ కార్యరూపం దాల్చలేదు. మేము వాటి గురించి ఎప్పుడూ రచ్చ చేయలేదు. ఇప్పుడు మేము కుదుర్చుకున్న ప్రతి ఒప్పందాన్ని క్షేత్రస్థాయిలోకి తీసుకెళ్లేందుకు పక్కాగా ఫాలో-అప్ చేస్తున్నాం” అని స్పష్టం చేశారు. ఈ పెట్టుబడుల ద్వారా 1.40 లక్షల మందికి ప్రత్యక్షంగా, మరో 2 లక్షల మందికి పరోక్షంగా ఉపాధి లభిస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు.

హైదరాబాద్ త్వరలోనే ప్రపంచానికే ‘జీసీసీ క్యాపిటల్’ కాబోతోందని మంత్రి ప్రకటించారు. గడిచిన ఏడాది కాలంలోనే 75 అంతర్జాతీయ స్థాయి గ్లోబల్ కేపబిలిటీ సెంటర్లను రాష్ట్రానికి తీసుకువచ్చామని వెల్లడించారు. ఐటీ, ఏరోస్పేస్, వ్యాక్సిన్ తయారీ రంగాల్లో తెలంగాణ అగ్రగామిగా ఉందని, ప్రపంచానికి అవసరమైన మూడు వంతుల వ్యాక్సిన్లు ఇక్కడి నుంచే ఎగుమతి అవుతున్నాయని గుర్తుచేశారు. వ్యాపార సంస్కరణల (BRAP) అమలులో కేంద్ర ప్రభుత్వం నుంచి తెలంగాణ అవార్డు అందుకోవడం మా ప్రభుత్వ పనితీరుకు నిదర్శనమని పేర్కొన్నారు.

వరంగల్ టెక్స్‌టైల్ పార్క్ బీఆర్ఎస్ పేటెంట్ అని చెప్పుకోవడంపై మంత్రి స్పందిస్తూ.. “రక్షణ రంగంలో DRDO, DRDL, అలాగే ఐటీ , మ్యానిఫ్యాక్చరింగ్ రంగాలకు పునాది వేసింది కాంగ్రెస్ పార్టీయే. కాకతీయ మెగా టెక్స్‌టైల్ పార్క్ పనులు అసంపూర్తిగా ఉంటే, సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా సందర్శించి నిధులు కేటాయించి పనులు పూర్తి చేయించారు. పీఎం మిత్ర పథకం కింద కేంద్రం నుండి 30 కోట్ల నిధులు తెచ్చింది మేమే” అని వివరించారు.

బీఆర్ఎస్ నేతలను ఉద్దేశించి మంత్రి ఘాటు వ్యాఖ్యలు చేస్తూ.. “మీరు హైప్ (Hype) లో ఉన్నారు.. మేము ప్రజల్లో హోప్ (Hope – నమ్మకం) క్రియేట్ చేస్తున్నాం” అన్నారు. గత ప్రభుత్వంలో ఉన్న ‘గేట్ పాస్’ కల్చర్‌ను రద్దు చేశామని, అందరినీ కలుపుకుని పారిశ్రామికాభివృద్ధికి కృషి చేస్తున్నామని చెప్పారు. కేవలం పరిశ్రమలు తేవడమే కాకుండా, స్థానిక యువతకు ఉపాధి దక్కేలా ఐటీఐ (ITI)లను ఏటీసీ (ATC)లుగా మార్చామని మంత్రి తెలిపారు. ఎంఎస్ఎంఈ (MSME)ల కోసం కొత్త పాలసీని తీసుకువచ్చామని, పారిశ్రామికవేత్తల్లో నమ్మకాన్ని నింపుతూ కక్షసాధింపులు లేని పాలనను అందిస్తున్నామని శ్రీధర్ బాబు స్పష్టం చేశారు. రాబోయే మూడేళ్లలో మరిన్ని భారీ పెట్టుబడులను ఆకర్షించి తెలంగాణను దేశంలోనే నంబర్ వన్ పారిశ్రామిక రాష్ట్రంగా నిలబెడతామని ఆయన ధీమా వ్యక్తం చేశారు.

Exit mobile version