NTV Telugu Site icon

ఏడేళ్ల తెలంగాణ‌…ప్ర‌జ‌ల ఆకాంక్ష‌ల‌కు అనుగుణంగా…

2014 జూన్ 2 వ తేదీన ప్రత్యేక తెలంగాణ ఆవిర్భ‌వించింది.  తెలంగాణ కోసం ఎంద‌రో పోరాటం చేశారు.  ఎంద‌రో ప్రాణ త్యాగం చేశారు.  నీళ్లు, నిధులు, నియామ‌కాల నినాదాల‌తో తెలంగాణ పోరాటం జ‌రిగింది.  తెలంగాణ సాధ‌న త‌రువాత మొద‌టి ముఖ్య‌మంత్రిగా కేసీఆర్ బాధ్య‌త‌లు చేప‌ట్టారు.  ప్ర‌జ‌ల ఆకాంక్ష‌ల‌కు అనుగుణంగా పాల‌న సాగుతున్న‌ది.  2018 వ సంవ‌త్స‌రంలో రెండోసారి ముఖ్య‌మంత్రిగా బాధ్య‌తలు చేప‌ట్టిన త‌రువాత మ‌రింత అభివృద్ధి దిశ‌గా తెలంగాణ అడుగులు వేస్తున్న‌ది.  1969 లో తెలంగాణ‌కోసం ఉమ్మ‌డి రాష్ట్రంలో తొలి ఉద్య‌మం ప్రారంభం అయింది.  ఎంద‌రో ఉద్య‌మంలో పాల్గొని ప్రాణాలు కోల్పోయారు.  ఆ త‌రువాత 2001 ఏప్రిల్ 21న డిప్యూటి స్పీక‌ర్‌గా కేసీఆర్ రాజీనామా చేసి మ‌లిద‌శ తెలంగాణ ఉద్య‌మానికి శ్రీకారం చుట్టారు.  2009 న‌వంబ‌ర్ 29 న కేసీఆర్ ఆమ‌ర‌ణ‌దీక్ష‌కు దిగ‌డంతో ఉద్య‌మం మ‌రింత తీవ్ర‌స్థాయికి చేరుకుంది.  తెలంగాణ ఆవిర్భ‌వించిన త‌రువాత కాళేశ్వ‌రం, మ‌ల్ల‌న్న‌సాగ‌ర్‌, కొండ‌పోచ‌మ్మ‌సాగ‌ర్, రంగ‌నాయ‌క‌మ్మ సాగ‌ర్ వంటి ఎన్నో ప్రాజెక్టులను ఏర్పాటు చేశారు.  అభివృద్ధి విష‌యంలో మిగ‌తా రాష్ట్రాల‌తో తెలంగాణ పోటీ ప‌డుతున్న‌ది.  అతి త‌క్కువ కాలంలోనే మిగులు బ‌డ్జెట్ సాధించిన రాష్ట్రంగా నిలిచింది తెలంగాణ‌.  ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం అవ‌త‌రించిన‌ప్ప‌టికీ భిన్న‌త్వంలో ఏక‌త్వాన్ని పక్క‌న పెట్ట‌కుండా అంద‌రికి స‌మాన‌మైన హ‌క్కులు క‌ల్పిస్తూ ప్ర‌గ‌తిపథంలో దూసుకుపోతున్న‌ది తెలంగాణ రాష్ట్రం.