Site icon NTV Telugu

South Central Railway: భారీ వర్షాలతో 10 రైళ్లు, MMTS సర్వీసులు రద్దు

South Central Railways

South Central Railways

తెలంగాణ వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. గత రెండు రోజులుగా ఎడతెరిపి లేకుండా అన్ని జిల్లాల్లో వానాలు పడుతున్నాయి. మరో మూడు రోజుల పాటు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది. దీంతో తెలంగాణ ప్రభుత్వం అప్రమత్తం అయింది. అత్యవసరం ఉంటే తప్పితే ఇంటి నుంచి బయటకు రావద్దని సీఎం కేసీఆర్ ప్రజలకు సూచించారు. రాష్ట్రంలో అన్ని విద్యా సంస్థలకు మూడు రోజుల పాటు సెలవులు ప్రకటించారు.

ఇటు తెలంగాణలో పాటు, ఏపీ, మహారాష్ట్రల్లో కూడా భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో దక్షిణ మధ్య రైల్వే ముందస్తుగా 10 రైళ్లను రద్దు చేసింది. మరో రెండు రైళ్లను పాక్షికంగా రద్దు చేసింది. సికింద్రాబాద్ – ఉందానగర్- సికింద్రాబాద్ రైల్ తో పాటు మెడ్చల్ – ఉందా నగర్, ఉందానగర్- సికింద్రాబాద్ స్పెషల్ రైళ్లను రద్దు చేసింది. ఇదే విధంగా నాందేడ్ – మేడ్చల్- నాందేడ్, సికింద్రాబాద్- మేడ్చల్- సికింద్రాబాద్, కాకినాడ-సికింద్రాబాద్- కాకినాడ, విజయవాడ-బిట్రగుంట-విజయవాడ రైళ్లను రద్దు చేసింది.

Read Also: Putin: మరోసారి తండ్రి కాబోతున్న రష్యా అధ్యక్షుడు.. 30 ఏళ్లు చిన్నదైన ప్రేయసితో..

మరోవైపు హైదరాబాద్ లో కురుస్తున్న భారీ వర్షాల ప్రభావం ఎంఎంటీఎస్ లోకల్ రైళ్లపై కూడా పడింది. భారీ వర్షాల కారణంగా హైదరాబాద్‌లో 34 ఎంఎంటీఎస్ రైళ్లు రద్దు చేసింది రైల్వే శాఖ. లింగంపల్లి-నాంపల్లి, లింగంపల్లి-ఫలక్‌నుమా మార్గాల్లో ఎంఎంటీఎస్ రైళ్లను అధికారులు రద్దు చేశారు.

Exit mobile version