Software Job: మన సమాజంలో సాఫ్ట్‌వేర్ ఉద్యోగం అంటే ఓ మోజు. సాఫ్ట్‌వేర్ ఉద్యోగి అంటేనే ఊళ్లలో, బంధువుల్లో గౌరవం. చివరకు వివాహం సంబంధాల్లో కూడా ఐటీ ఎంప్లాయ్ అంటేనే ముద్దు. ఇలాంటి పరిస్థితుల్లో, యువత ఐటీ జాబ్ సంపాదించేందుకు పడరాని పాట్లు పడుతున్నారు. తల్లిదండ్రులు కూడా తమ కొడుకు హైదరాబాద్, బెంగళూర్ లేదా వీలైతే విదేశాల్లో ఐటీ జాబ్ చేయాలనే కలలు కంటున్నారు. ఈ ఆశల్ని కొందరు మోసగాళ్లు క్యాష్ చేసుకుంటున్నారు. ఉద్యోగాల పేరిట చాలా ఫేక్ ఐటీ కంపెనీలు ఉద్యోగం ఆశిస్తున్న వారి నుంచి లక్షల్లో దండుకుని బోర్డు తిప్పేస్తున్నాయి.
Read Also: Shehbaz Sharif: సియాల్‌కోట్ ఎయిర్‌బేస్‌ను సందర్శించిన పాక్ ప్రధాని.. కారణమిదేనా?
తాజాగా, మరోసారి ఇలాంటి సంఘటనే హైదరాబాద్‌లో చోటు చేసుకుంది. గచ్చిబౌలిలో ఓ సాఫ్ట్‌వేర్ కంపెనీ బోర్డు తిప్పేసింది. తమ వద్ద ట్రైనింగ్ తీసుకున్న వారికి జాబ్స్ ఇప్పిస్తామని ప్యూరోపేల్ క్రియేషన్ అండ్ ఐటీ సొల్యూషన్స్ అనే కంపెనీ పలువురిని మోసం చేసింది. వర్క్ ఫ్రం హోమ్ ఉద్యోగాలు ఉంటాయని చెబుతూ, చాలా మంది వద్ద నుంచి విడతల వారీగా రూ. 2 లక్షలకు పైగా వసూలు చేసింది. జాబ్స్ లేకపోవడంతో గచ్చిబౌలిలోని ఆఫీస్‌కి వెళ్లగా, అక్కడ బోర్డు లేకపోవడంతో తాము మోసపోయినట్లు గుర్తించారు. ఈ వ్యవహారంలో సుమారు 200 మంది మోసపోయారు. తమ వద్ద నుంచి లక్షల్లో డబ్బు వసూలు చేశారని బాధితులు లబోదిబోమంటున్నారు. బాధితులు గచ్చిబౌలి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.
