Site icon NTV Telugu

SLBC : ఎస్‌ఎల్‌బీసీ ప్రమాదానికి 150 రోజులు.. ఇంకా దొరకని ఆరుగురి మృతదేహాలు

Slbc

Slbc

SLBC : నాగర్‌కర్నూల్ జిల్లా ప్రజలను కుదిపేసిన ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్ ప్రమాదానికి 150 రోజులు పూర్తయ్యాయి. ఫిబ్రవరి 22న జరిగిన ఈ ప్రమాదంలో 14వ కిలోమీటర్ వద్ద టన్నెల్ కుప్పకూలడంతో 8 మంది కార్మికులు సజీవ సమాధి అయ్యారు. ఇప్పటి వరకు కేవలం ఇద్దరి మృతదేహాలనే వెలికితీశారు, మిగతా ఆరుగురు కార్మికుల మృతదేహాలు టన్నెల్‌లోనే ఉన్నాయి.

ప్రమాదం జరిగిన ప్రాంతాన్ని నో గో జోన్‌గా ప్రకటించి కంచె ఏర్పాటు చేశారు. 63 రోజుల పాటు జరిగిన రెస్క్యూ ఆపరేషన్ విఫలమవడంతో ఇక మిగతా శవాలను వెలికితీయడం కష్టమని అధికారులు స్పష్టం చేశారు.

ఎస్‌ఎల్‌బీసీ పనులు నిలిచిపోకుండా పూర్తి చేయడానికి ప్రభుత్వం కసరత్తు ప్రారంభించింది. డెన్మార్క్‌ నుంచి ఎలక్ట్రో మాగ్నటిక్ సర్వే పరికరాలు తెప్పించారు. వైమానిక దళ హెలికాప్టర్లు, లైడార్ సర్వేల సహాయంతో భూభాగ పరిశీలనలు చేస్తున్నారు. సొరంగ తవ్వకాల కోసం భూమి పొరలు, షీర్ జోన్‌లపై సమగ్ర అధ్యయనం చేస్తున్నారు.

మన్నెవారిపల్లి, నల్లవాగు, మల్లెలతీర్దం ప్రాంతాలతో పాటు టన్నెల్ కూలిన ప్రదేశాల్లో నేషనల్ జియో ఫిజికల్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్‌ (ఎన్‌జీఆర్‌ఐ) బృందాలు భూ పరిశోధనలు కొనసాగిస్తున్నాయి. ఈ అధ్యయనాల ఆధారంగా భవిష్యత్తులో ప్రమాదాలు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ప్రభుత్వం భావిస్తోంది.

Harish Rao: ఒకప్పుడు తెలంగాణలో ఎకరం అమ్మితే ఏపీలో 10 ఎకరాలు వచ్చేవి.. ఇప్పుడు సీన్ రివర్స్ అయింది!

Exit mobile version