ఫోన్ ట్యాపింగ్ కేసులో మాజీ ఎస్ఐబీ చీఫ్ ప్రభాకర్ రావుపై ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) నేడు ఐదవ రోజు కస్టోడియల్ విచారణ చేపట్టనుంది. ఆయన ఎస్‌ఐబీ చీఫ్‌గా ఉన్న సమయంలో వినియోగించిన ఒక మొబైల్ ఫోన్‌ను ఈ ఏడాది ఏప్రిల్‌లో హైదరాబాద్‌లోని ఆయన నివాసంలో ఫార్మాట్ చేసినట్లు సిట్ గుర్తించింది. అయితే ఆ సమయంలో ప్రభాకర్ రావు అమెరికాలో ఉన్నారని అధికారులు వెల్లడించారు. ఈ విషయాన్ని ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్ (FSL) నివేదిక కూడా ధృవీకరించినట్లు సమాచారం.
ఈ నేపథ్యంలో ఫోన్‌ను ఎవరు ఫార్మాట్ చేశారు? దానికి గల కారణాలేమిటి? అనే కోణంలో సిట్ లోతైన విచారణ కొనసాగిస్తోంది. ఫోన్ ఫార్మాట్ చేసిన సమయంలో ఇంట్లో ఎవరు ఉన్నారు, ఈ ప్రక్రియకు ఎవరు సహకరించారు, ఎవరి ఆదేశాల మేరకు ఇది జరిగిందన్న అంశాలపై సిట్ దృష్టి సారించింది. వాట్సాప్ కాల్స్, చాట్స్, ఐపీ అడ్రెసుల ఆధారంగా ప్రభాకర్ రావును ప్రశ్నిస్తున్నప్పటికీ ఆయన నుంచి సరైన సమాధానాలు రావడం లేదని తెలుస్తోంది.
2024 మార్చి 10న పంజాగుట్ట పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైన అనంతరం ప్రభాకర్ రావు అమెరికాకు వెళ్లినట్లు అధికారులు తెలిపారు. ఇదే సమయంలో మొబైల్ ఫోన్‌లు, క్లౌడ్ డేటా, ల్యాప్‌టాప్‌లోని కీలక సమాచారాన్ని ఎందుకు డిలీట్ చేయాల్సి వచ్చిందన్న అంశంపైనా సిట్ విచారణ చేపట్టింది. గత ప్రభుత్వ ఆదేశాల మేరకే ఫోన్ ట్యాపింగ్ జరిగిందని సిట్ వద్ద పటిష్ట ఆధారాలు ఉన్నట్లు సమాచారం. ఫోన్ ట్యాపింగ్ ఎవరి ఆదేశాలపై జరిగింది అనే కీలక అంశంపై సిట్ దర్యాప్తు కొనసాగుతోంది.
