Hyderabad Water Alert : హైదరాబాద్ వాసులకు తాగునీటి ముప్పు..!

  • డెడ్ స్టోరేజ్‌కు చేరిన సింగూరు ప్రాజెక్టు
  • జూలై చివరి వరకే నీటి సరఫరా..?
  • 17 మోటార్లతో ఎమర్జెన్సీ పంపింగ్ ఏర్పాట్లు
  • మిషన్ భగీరథ అధికారుల యుద్ధ ప్రాతిపదిక చర్యలు
Hyd

Hyd

Hyderabad Water Alert : హైదరాబాద్ మహానగరంతో పాటు చుట్టుపక్కల జిల్లాలకు తాగునీటిని అందించే కీలకమైన సింగూరు ప్రాజెక్టులో నీటి నిల్వలు ప్రమాదకర స్థాయికి పడిపోయాయి. సంగారెడ్డి జిల్లాలో ఉన్న ఈ ప్రాజెక్టులో ప్రస్తుతం ‘డెడ్ స్టోరేజ్’ (మృత నిల్వ) స్థాయికి నీటి మట్టం చేరుకోవడంతో రాబోయే రోజుల్లో తాగునీటి సరఫరాపై ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.

జూలై నెలాఖరు వరకే నీటి సరఫరాకు ఛాన్స్

సింగూరు ప్రాజెక్టు మొత్తం నీటి నిల్వ సామర్థ్యం 29.917 టీఎంసీలు కాగా, ప్రస్తుతం అందులో కేవలం 5 టీఎంసీల నీరు మాత్రమే నిల్వ ఉంది. ప్రస్తుతమున్న నీటి పరిమాణాన్ని బట్టి చూస్తే, కేవలం రాబోయే జూలై నెలాఖరు వరకు మాత్రమే ఇక్కడి నుండి నీటిని సరఫరా చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. ఈ లోగా వర్షాలు పడకపోతే తాగునీటి ఇబ్బందులు తలెత్తే ప్రమాదం ఉంది.

×
×
Ad

అధికారుల అప్రమత్తత.. ‘ఎమర్జెన్సీ పంపింగ్’కు ఏర్పాట్లు

ప్రాజెక్టులో నీటి మట్టం అడుగున పడిపోవడంతో సాధారణ పద్ధతిలో ఇన్‌టేక్ వెల్ ద్వారా నీరు అందడం లేదు. ఈ పరిస్థితిని ఎదుర్కొనేందుకు హైదరాబాద్ జలమండలి (HMWSSB) అధికారులు అప్రమత్తమయ్యారు. నగర ప్రజలకు తాగునీటి కొరత రాకుండా ఉండేందుకు ‘ఎమర్జెన్సీ పంపింగ్’ ప్రక్రియను చేపట్టేందుకు అవసరమైన ఏర్పాట్లు చేశారు. ఇందులో భాగంగా నీటిని పైకి పంపింగ్ చేయడానికి అత్యవసరంగా 17 భారీ మోటార్లను సిద్ధం చేశారు.

నత్తనడకన సాగుతున్న రూ. 16 కోట్ల రివిట్మెంట్ పనులు

ఇదిలా ఉండగా, గతంలో అందిన డ్యామ్ సేఫ్టీ (ఆనకట్ట భద్రత) నివేదిక ఆధారంగా సింగూరు ప్రాజెక్టు వద్ద రూ. 16 కోట్ల వ్యయంతో రివిట్మెంట్ పనులను ప్రభుత్వం చేపట్టింది. అయితే, ఈ పనుల పురోగతి నెమ్మదిగా సాగుతుండటంపై స్థానికంగా ఆందోళన వ్యక్తమవుతోంది. నత్తనడకన సాగుతున్న ఈ నిర్మాణ పనులు ప్రస్తుత వర్షాకాలం ముగిసే నాటికి పూర్తవుతాయా లేదా అనే అంశంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

యుద్ధ ప్రాతిపదికన చర్యలు

సింగూరు ప్రాజెక్టు కేవలం హైదరాబాద్‌కే కాకుండా మెదక్, నిజామాబాద్, రంగారెడ్డి జిల్లాలకు సైతం ‘మిషన్ భగీరథ’ పథకం ద్వారా తాగునీటిని అందిస్తోంది. నీటి నిల్వలు తగ్గినప్పటికీ, ఈ జిల్లాల పరిధిలోని ప్రజలకు ఎలాంటి తాగునీటి ఇబ్బందులు కలగకుండా చూసేందుకు జలమండలి , మిషన్ భగీరథ అధికారులు సంయుక్తంగా యుద్ధ ప్రాతిపదికన ప్రత్యామ్నాయ చర్యలు తీసుకుంటున్నారు.