NTV Telugu Site icon

Shabbir Ali: దమ్ముంటే రమ్మంటూ కేటీఆర్‌కు షబ్బీర్ అలీ సవాల్

Shabbir Ali To Ktr

Shabbir Ali To Ktr

Shabbir Ali Challenges KTR On Telangana Farmers Issue: రాష్ట్రంలో రైతుల సమస్యలు లేవని చెప్తున్న కేటీఆర్‌కు రైతుల ఇబ్బందులేంటో చూపిస్తానని.. దమ్ముంటే రావాలని కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ మంత్రి షబ్బీర్ అలీ సవాల్ విసిరారు. కామారెడ్డి భవాని రోడ్‌లో హాథ్ సే హాథ్ జోడో పాదయాత్రలో పాల్గొన్న ఆయన.. తెలంగాణ ఏర్పాటయ్యాక ఈ ప్రభుత్వం రూ.5 లక్షల కోట్ల అప్పు చేసిందని, ఈ డబ్బంతా కేసీఆర్ కుటుంబంలోనే తిరుగుతోందని ఆరోపించారు. కామారెడ్డి, ఎల్లారెడ్డి నియోజకవర్గాల రైతులకు సాగునీరు అందించే ప్రాజెక్టు పనులకు బడ్జెట్‌లో ఒక్క రూపాయి కూడా కేటాయించలేదని వ్యాఖ్యానించారు. ఈ విషయంపై జిల్లా ఎమ్మెల్యేలు, మంత్రికి కేసీఆర్‌ని నిలదీసి అడిగే దమ్ముందా? అని ప్రశ్నించారు. కాళేశ్వరం ప్రాజెక్టు సందర్శనకు అనుమతి ఇవ్వడం లేదని, సచివాలయంలో ప్రమాదం జరిగితే అక్కడా వెళ్లనివ్వట్లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. అవేమైనా కేసీఆర్, కేటీఆర్ జాగీరా? వాళ్ళ సొంత ఆస్తులా? అని నిలదీశారు. ఇదే సమయంలో బీజేపీపై కూడా ధ్వజమెత్తారు. దేశాన్ని విభజించేలా బీజేపీ మతాలపై చిచ్చు పెడుతోందని ఫైర్ అయ్యారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే.. రూ.5 లక్షలతో ఇల్లు నిర్మిస్తామని, స్థలం ఉంటే రూ.5 లక్షలిస్తామని హామీ ఇచ్చారు. రైతు రుణమాఫీ ఒకేసారి మాఫీ చేస్తామన్నారు.

Komatireddy Venkat Reddy: నా వ్యాఖ్యల్ని వక్రీకరించారు.. బీజేపీ రాజకీయం చేస్తోంది

ఈ యాత్రలో షబ్బీర్ అలీతో పాటు రాష్ట్ర మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు సునీతారావు కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. రాష్ట్రంలో బీఆర్ఎస్ పాలన అగమ్యగోచరంగా తయారైందని విమర్శించారు. మహిళలకు గౌరవం ఇవ్వడం లేదని ధ్వజమెత్తారు. మహిళా సంఘాలకు ఈ ప్రభుత్వం రూ.4,250 కోట్లు బకాయి ఉందన్నారు. పథకాలన్నీ బంద్ చేసినా.. మద్యం మాత్రం బంద్ కావడం లేదని మండిపడ్డారు. అంతకుముందు.. తెలంగాణ‌లో నిత్యావసర ధరలు విపరీతంగా పెంచేసి, ప్రజ‌లపై ప్రభుత్వం భారం మోపింద‌ని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు.

Supreme Court : బెయిల్ ఇవ్వండి బిడ్డను కంటాం.. ట్విస్ట్ ఇచ్చిన కోర్టు