Shabad Murder Case : రంగారెడ్డి జిల్లా షాబాద్ మండలంలో సంచలనం సృష్టించిన ఆరు హత్యల కేసులో విస్తుపోయే నిజాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ ఘోరానికి పాల్పడిన హంతకుడు రాజ్‌కుమార్ విషం తాగి ఆత్మహత్య చేసుకోగా, అతను మరణించడానికి ముందే రికార్డ్ చేసిన ఒక సంచలన సెల్ఫీ వీడియో ఇప్పుడు పోలీసులకు చిక్కింది. రాజ్‌కుమార్ మృతదేహం లభ్యమైన చోటే అతడి మొబైల్ ఫోన్ కూడా దొరికిందని, అందులోనే ఈ సెల్ఫీ స్టేట్‌మెంట్ ఉందని సిటీ పోలీస్ కమిషనర్ తరుణ్ జోషి అధికారికంగా వెల్లడించారు. జూలై 10న సాయంత్రం 4:55 గంటల సమయంలో.. అంటే ఈ దారుణానికి ఒడిగట్టడానికి కొద్దిగంటల ముందే రాజ్‌కుమార్ ఈ వీడియోను రికార్డ్ చేశాడు. అసలు తాను ఈ ఘాతుకానికి ఎందుకు ఒడిగట్టాల్సి వచ్చిందో అందులో క్లియర్ గా వివరించాడు.
‘నా సంపాదన అంతా వాళ్లే తగలేశారు’.. జీవితంపై విరక్తితోనే దారుణం
దొరికిన సెల్ఫీ వీడియోలో రాజ్‌కుమార్ తన ఆక్రోశాన్ని, ఆవేదనను వెళ్లగక్కాడు. “నా సంపాదనలో సగం వాళ్ల కోసమే తగలేశా. నా దగ్గర నుంచి పెద్ద మొత్తంలో పైసలు లాగి నన్ను పూర్తిగా రోడ్డున పడేశారు. ఆ అమ్మాయిని నమ్మి సర్వస్వం కోల్పోయి అప్పులపాలయ్యా. ఆఖరికి నా కన్న పిల్లలకు రూపాయి భూమి కూడా లేకుండా చేసేశారు. నన్ను ఇంతలా ముంచేసి.. చివరకు నాపైనే కేసు పెట్టి జైలుకు పంపాలని చూశారు” అంటూ రాజ్‌కుమార్ సదరు వీడియోలో తీవ్ర కక్షను ప్రదర్శించాడు. ఆ అమ్మాయి, ఆమె కుటుంబం తనను అన్ని విధాలా వాడుకుని మోసం చేశారని, ఆ వేధింపుల వల్లే తనకు జీవితం మీద విరక్తి వచ్చిందని.. అందుకే వారిని, తన కుటుంబాన్ని చంపి తాను కూడా ఆత్మహత్య చేసుకుంటున్నట్లు వీడియోలో పేర్కొన్నాడు.
‘మా నాన్న స్థలంలో నన్ను పూడ్చొద్దు’.. నిందితుడి ఆఖరి కోరిక
ఆరుగురిని అత్యంత దారుణంగా హతమార్చిన అనంతరం రాజ్‌కుమార్ తన చావుకు గల కారణాలను వివరిస్తూ ఆవేదన చెందాడు. ఆ అమ్మాయిని నమ్ముకుని తాను సర్వస్వం కోల్పోయానని, ఆమె కుటుంబం వల్లే అప్పులపాలై, తనకున్న రెండెకరాల పొలాన్ని కూడా అమ్ముకోవాల్సి వచ్చిందని చెప్పాడు. ఆ డబ్బులతోనే అప్పులు తీర్చానని, అయినా వారు తనపై కేసు పెట్టి పరువు తీశారని ఆరోపించాడు. “నాకు ఇప్పుడు ఆస్తిపాస్తులు ఏమీ లేవు. మా నాన్న స్థలంలో నన్ను పూడ్చి పెట్టవద్దు. నన్ను, నా పిల్లల్ని, నా భార్యను అనాథ శవాల్లాగే ఎక్కడైనా పూడ్చిపెట్టండి” అంటూ ఆ సెల్ఫీ వీడియోలో రాజ్‌కుమార్ తన చివరి కోరికను కోరడం గమనార్హం.
అసలేం జరిగిందంటే..? పోక్సో కేసే కారణమా?
రాజ్‌కుమార్‌పై గతంలో పోక్సో (POCSO) కేసు నమోదైంది. ఆ కేసు పెట్టారనే కక్షతోనే ఈ నెల 10న అతను ఈ నరమేధానికి ఒడిగట్టాడు. మొదట షాబాద్ టౌన్‌లో ఒక మైనర్ బాలిక తల్లి, నాయనమ్మలను అతికిరాతకంగా నరికి చంపాడు. ఆ తర్వాత తన సొంత భార్యాపిల్లలను కూడా వదలకుండా కడతేర్చాడు. అనంతరం సదరు మైనర్ బాలికను బలవంతంగా కారులో ఎక్కించుకుని అఖిల్ సాగర్ చెరువు వద్దకు తీసుకెళ్లి గొంతుకోసి హతమార్చాడు. ఈ ఆరు హత్యల ఉదంతం రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర సంచలనం సృష్టించగా, పోలీసులు 12 ప్రత్యేక బృందాలతో గాలింపు చేపట్టారు. ఈ క్రమంలోనే పోలీసులకు దొరకకుండా నిందితుడు చివరకు విషం తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
విచారణలో మరిన్ని షాకింగ్ నిజాలు.. ఫోరెన్సిక్ ల్యాబ్‌కు మొబైల్
రాజ్‌కుమార్ తన భార్య, పిల్లలను చంపే ఆ భయానక సమయంలో సదరు మైనర్ బాలిక కారులోనే ఉందనే ఆందోళనకరమైన విషయం కూడా పోలీసుల విచారణలో వెలుగులోకి వచ్చింది. ఆ సమయంలో బాలిక కారులోనే ఉండి ఈ దారుణాన్ని కళ్లారా చూసి ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు. ప్రస్తుతం లభ్యమైన నిందితుడి మొబైల్ ఫోన్‌తో పాటు అందులోని సెల్ఫీ వీడియోను మరింత లోతుగా విశ్లేషించడానికి సైన్స్ అండ్ ఫోరెన్సిక్ ల్యాబ్ (FSL) కు పంపించామని సీపీ తరుణ్ జోషి తెలిపారు. పూర్తి సాంకేతిక ఆధారాలను సేకరిస్తూ కేసు దర్యాప్తును వేగవంతం చేస్తున్నట్లు ఆయన స్పష్టం చేశారు.

