Fire Accident: సికింద్రాబాద్‌లోని సీతాఫల్‌మండి ప్రధాన రహదారిపై ఉన్న ఓ టపాసుల దుకాణంలో శనివారం రాత్రి ఆకస్మికంగా భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. రోడ్డు పక్కన ఏర్పాటు చేసిన బాణసంచా దుకాణంలోకి అనుకోకుండా ఓ తారాజువ్వ (రాకెట్) దూసుకొచ్చి పడటంతో ఈ ప్రమాదం సంభవించింది. తారాజువ్వ నిప్పురవ్వలు తాకడంతో దుకాణంలో నిల్వ ఉంచిన టపాసులు ఒక్కసారిగా పెద్ద శబ్దాలతో పేలడం మొదలయ్యాయి. క్షణాల వ్యవధిలోనే మంటలు దుకాణం మొత్తానికి వ్యాపించాయి. దుకాణంలోని క్రాకర్స్ అన్నీ ఏకధాటిగా పేలిపోతూ, నిప్పురవ్వలు నలువైపులా ఎగసిపడటంతో ఆ ప్రాంతమంతా దట్టమైన పొగ కమ్ముకుంది.
అనుకోని రీతిలో వరుస పేలుళ్లు సంభవించడంతో సమీపంలోని స్థానికులు, వాహనదారులు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. ఏం జరుగుతుందో అర్థం కాక ప్రాణభయంతో తలోదిక్కుకు పరుగులు తీశారు. దాదాపు పది నిమిషాల పాటు ప్రధాన రహదారిపై టపాసుల పేలుళ్లతో తీవ్ర గందరగోళం, హంగామా నెలకొంది. ట్రాఫిక్ పూర్తిగా స్తంభించిపోయింది. స్థానికులు వెంటనే అప్రమత్తమై నీళ్లు, ఇసుకతో మంటలను అదుపు చేసే ప్రయత్నం చేశారు. అదృష్టవశాత్తూ దుకాణంలో ఉన్నవారు, సమీపంలో ఉన్నవారు వెంటనే దూరంగా వెళ్లడంతో ప్రాణనష్టం తప్పిందని, అయితే దుకాణంలోని సరుకు పూర్తిగా దగ్ధమైనట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. రద్దీగా ఉండే రోడ్లపై నిబంధనలకు విరుద్ధంగా టపాసుల విక్రయాలు జరపడం వల్లే ఇలాంటి ప్రమాదాలు జరుగుతున్నాయని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

