సీమంతం అంటే మన సంస్కృతిలో ఎంతో ముఖ్యమయిన ఘట్టం. తల్లి సౌభాగ్యాన్ని, పుట్టబోయే బిడ్డ దీర్ఘాయుష్షును కోరుతూ చేసే ఘట్టం సీమంతం. కడుపులోని బిడ్డ ఆరోగ్యకరంగా ఎదగడానికి తల్లి శారీరక, మానసిక ఉల్లాసం ఎంతో అవసరం. అందుకోసం ఆమె, ఆమె భర్త ఎన్నో నియమాలు పాటించాలి. ఆరవనెల గాని, ఎనిమిదవ నెలలో గానీ సీమంతం జరుపుతుంటారు. ఏ శుభకార్యాల్లో లేని విధంగా సీమంతంలో గాజులు తొడిగి పండంటి బిడ్డను ఇమ్మని ఆశీర్వదిస్తారు. అలా గాజులు ఎందుకు తొడుగుతారంటే గర్భం ధరించిన స్త్రీ గర్భకోశం మీద కావలసినంత జీవనాడుల ఒత్తిడి కావాలి. చేతుల్లో నరాలకీ, గర్భకోశానికి అవినాభావ సంబంధం ఉంది. అలా ఎక్కువ గాజులు తొడగడం వలన గర్భకోశం పై సరైన ఒత్తిడి వచ్చి సుఖప్రసవం జరుగుతుందంటారు.
సాధారణంగా మహిళలకు సీమంతం జరపడం ఆనవాయితీ. కానీ మన సంప్రదాయంలో గోమాతకు ఎంతో విశిష్టత వుంది. గోమాతకు కూడా సీమంతం జరుపుతున్నారు అనేకమంది. అఖిలభారత గో సేవ ఫౌండేషన్ ఆధ్వర్యంలో సైదాబాద్ లక్ష్మీనగర్ కాలనీలో చైర్మన్ బాలకృష్ణ గౌడ్ ఆధ్వర్యంలో పుంగనూరు ఆవుల సీమంతం కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. వందలాది మంది మహిళలతో అంగరంగ వైభవంగా గోమాత సీమంతం నిర్వహించారు. ముఖ్య అతిథులుగా మాతా నిర్మలానంద యోగ భారతి, తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి సభ్యులు మూరం శెట్టి రాములు హాజరయ్యారు. అందంగా అలంకరించిన గోవులను ఎంతో భక్తిశ్రద్ధలతో పూజించి వాటికి సీమంతం నిర్వహించారు.
గోమాతకు సీమంతం
