Road Collapse: సంగారెడ్డి జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు కురవడంతో పరిస్థితి తీవ్రంగా మారింది. సదాశివపేట్ మండలం నాగ్సన్‌పల్లి- నందికంది పెద్ద వాగు పొంగి పొర్లడంతో NH-65 హైవే అర్ధరాత్రి చెరువులా మారిపోయింది. శిల్పా వెంచర్ నుంచి వచ్చిన వరద నీటితో హైవే ముంపుకు గురై, రాత్రి పొడవునా ఇరువైపులా భారీ ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. వరద తగ్గడంతో వాహనాలు నెమ్మదిగా ముందుకు కదులుతున్నప్పటికీ, రోడ్డుపక్కన ఉన్న పెట్రోల్ బంక్‌లు, హోటళ్లు, దాబాలు ఇంకా జలదిగ్బంధంలోనే ఉండిపోయాయి.
Read Also: India: పాక్ ప్రోత్సాహంతోనే భారత్‌లో ఉగ్ర దాడులు.. యూఎన్‌లో షరీఫ్ ప్రసంగాన్ని తిప్పికొట్టిన భారత్
ఇక, కొండాపూర్ మండలంలో భారీగా వాన కురవడంతో అర్ధరాత్రి 10 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఫలితంగా చెరువులు నిండుకుండలుగా మారి, వాగులు పొంగి పొర్లుతున్నాయి. సైదాపూర్ గ్రామ శివారులో వాగు ఉధృతితో రహదారి కొట్టుకుపోవడంతో, సంగారెడ్డి జిల్లా నుంచి వికారాబాద్‌లోని మొమిన్‌పేట్, తాండూర్ వైపు వెళ్లే రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. రోడ్డు తెగిపోవడంతో ప్రయాణికులు తీవ్ర అవస్థలు పడుతున్నారు.
Read Also: Viral Video: ఫుల్ గా తాగి స్కూల్ కి వచ్చి.. సోయి లేకుండా పడుకున్న లేడీ ప్రిన్సిపాల్
మరోవైపు, ఏడు పాయల ఆలయం ఎదుట మంజీరా నది మహోగ్రరూపం దాల్చింది. గత 15 రోజులుగా ఏడు పాయల వన దుర్గ భవానీ ఆలయం మూతపడి ఉంది. సింగూర్ ప్రాజెక్ట్ గేట్లు ఎత్తడంతో దిగువకు భారీగా వచ్చిన వరద ఎఫెక్ట్ తో రాజగోపురంలోనే అమ్మవారి దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు కొనసాగుతున్నాయి. ఇవాళ రాజగోపురంలో లలితా త్రిపుర సుందరి దేవిగా అమ్మవారు దర్శనం ఇస్తున్నారు. కాగా, ఆలయం ఎదుట ప్రమాదకర స్థాయిలో మంజీరా నది ప్రవహిస్తుండటంతో భక్తులను ఎవరిని అటువైపుకు అనుమతించడం లేదు అధికారులు.
