Power Bank Explosion : సంగారెడ్డి జిల్లాలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. పాఠశాల మైదానంలో లభించిన ఒక పవర్ బ్యాంక్ అకస్మాత్తుగా పేలిపోవడంతో నాలుగో తరగతి చదువుతున్న విద్యార్థి తీవ్రంగా గాయపడ్డాడు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. అందిన వివరాల ప్రకారం.. కోహీర్ మండలం కొత్తూరు (D) గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో ఈ ప్రమాదం జరిగింది. ఆ పాఠశాలలో 4వ తరగతి చదువుతున్న రాకేష్ అనే విద్యార్థి గ్రౌండ్‌లో ఆడుకుంటుండగా అతనికి ఒక పవర్ బ్యాంక్ దొరికింది. దానిని కుతూహలంతో తీసి తన ప్యాంట్ జేబులో పెట్టుకుని ఆడుకోవడం ప్రారంభించాడు. ఈ క్రమంలోనే ఒక్కసారిగా ఆ పవర్ బ్యాంక్ పెద్ద శబ్దంతో పేలిపోవడంతో మంటలు చెలరేగాయి.
చికిత్స కోసం గాంధీ ఆస్పత్రికి తరలింపు
ఈ అనుహ్య ప్రమాదంలో రాకేష్ కుడికాలు , కడుపు భాగంలో తీవ్రంగా కాలిన గాయాలయ్యాయి. గమనించిన ఉపాధ్యాయులు, స్థానికులు వెంటనే స్పందించి బాధితుడిని చికిత్స నిమిత్తం ముందుగా సంగారెడ్డి జిల్లా ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అక్కడ ప్రాథమిక చికిత్స అందించిన అనంతరం, గాయాల తీవ్రత ఎక్కువగా ఉండటంతో మెరుగైన వైద్యం కోసం సికింద్రాబాద్‌లోని గాంధీ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం బాలుడికి వైద్యులు అత్యవసర చికిత్స అందిస్తున్నారు.

