Missing Schoolgirls : మిస్టరీకి ఎండ్.. మాయమైన బాలికలు.. సేఫ్‌గా దొరికారు.!

  • పాఠశాలకు వెళ్తున్నామని చెప్పి అదృశ్యం
  • పోలీసుల వేగవంతమైన గాలింపు
  • సికింద్రాబాద్‌లో సురక్షితంగా గుర్తింపు
  • తల్లిదండ్రులకు అప్పగించనున్న పోలీసులు
Missing

Missing

Missing Schoolgirls : సంగారెడ్డి జిల్లా ఇస్నాపూర్‌లో ఇటీవల అదృశ్యమైన బీహార్‌కు చెందిన నలుగురు బాలికల మిస్సింగ్ కేసుకు పోలీసులు సుఖాంతం పలికారు. ఈనెల 23న స్థానిక ప్రభుత్వ పాఠశాలకు వెళ్తున్నామని ఇంట్లో చెప్పి వెళ్లిన ఈ విద్యార్థినులు సాయంత్రానికైనా తిరిగి రాకపోవడంతో ఆందోళన చెందిన తల్లిదండ్రులు పాఠశాలకు వెళ్లి విచారించారు. అయితే ఆ రోజు విద్యార్థినులు అసలు బడికే రాలేదని పాఠశాల సిబ్బంది తెలపడంతో, వారు వెంటనే పటాన్‌చెరు పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు రంగంలోకి దిగి గాలింపు చర్యలు చేపట్టగా, ఈ రోజు నలుగురు బాలికలను సికింద్రాబాద్‌లో సురక్షితంగా గుర్తించి అదుపులోకి తీసుకున్నారు.

అదృశ్యమైన విద్యార్థినులను కుష్బూ కుమారి (16), మహిమా కుమారి (12), రోజా కుమారి (12), ప్రియా కుమారి (12)గా పోలీసులు ధ్రువీకరించారు. వీరంతా ఇస్నాపూర్ ప్రభుత్వ పాఠశాలలో చదువుకుంటున్నారని, ప్రస్తుతం నలుగురు బాలికలు క్షేమంగా ఉన్నారని అధికారులు తెలిపారు. చురుగ్గా వ్యవహరించి బాలికలను కనిపెట్టిన పటాన్‌చెరు పోలీసులు, అన్ని ప్రక్రియలు పూర్తి చేసి మరికొద్ది సేపట్లో వారిని సురక్షితంగా తల్లిదండ్రులకు అప్పగించనున్నారు. దీంతో గత రెండు రోజులుగా తీవ్ర భయాందోళనలో ఉన్న బాలికల కుటుంబ సభ్యులు , స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు.