NTV Telugu Site icon

Rythu Bima: రైతు బీమా ఇవ్వనందుకు ఎల్‌ఐసీకి రూ.50 వేల జరిమానా, వడ్డీ

Rythu Bima

Rythu Bima

Rythu Bima: పుట్టిన తేదీ ఆధార్‌ కార్డులో కరెక్టుగానే ఉన్నప్పటికీ అధికారి తప్పుగా ఎంటర్‌ చేసినందన రైతు(కు)బీమా ఇవ్వకపోవటం కరెక్ట్‌ కాదని సంగారెడ్డి జిల్లా వినియోగదారుల వివాదాల పరిష్కార కమిషన్‌ తప్పుపట్టింది. బీమా సొమ్ము రూ.5 లక్షలను 2 శాతం వడ్డీతో చెల్లించాలని, దీనికితోడు నష్టపరిహారం కింద అదనంగా రూ.50 వేలు ఇవ్వాలని జీవిత బీమా సంస్థ(ఎల్‌ఐసీ)ను ఆదేశించింది. అధికారులు రైతుల వివరాలను సరిగ్గా నమోదుచేయాలని సూచించింది. సిద్దిపేట జిల్లా దౌలతాబాద్‌కి చెందిన మహ్మద్‌ నజీర్‌ 1960లో జన్మించాడు.

ఎడ్యుకేషనల్‌ సర్టిఫికెట్స్‌లో కూడా ఈ సంవత్సరమే (1960) నమోదైంది. అయితే ఆధార్‌ కార్డులో మాత్రం 1959 జూలై 1 అని రికార్డు చేశారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న రైతుబీమా పథకానికి ఆధార్‌ కార్డులో నమోదైన పుట్టిన తేదీనే పరిగణనలోకి తీసుకుంటున్నారు. అయితే.. దౌలతాబాద్‌ క్లస్టర్‌ అగ్రికల్చర్‌ ఎక్స్‌టెన్షన్‌ ఆఫీసర్‌ (ఏఈఓ) వినోద్‌ కుమార్‌ మాత్రం మహ్మద్‌ నజీర్‌ డేట్‌ ఆఫ్‌ బర్త్‌ని పొరపాటున 1959 ఆగస్టు 14 అని ఎన్‌రోల్‌ చేశాడు. ఆ వివరాలనే ఎల్‌ఐసీకి పంపారు. ఎల్‌ఐసీ కూడా ఇవేవీ చెక్‌ చేయకుండా ప్రీమియం తీసుకుంది.

read also: Taj Mahal: వహ్‌.. తాజ్‌. 144 కట్టడాల్లో టాప్‌లో నిలిచిన తాజ్‌మహల్‌.

పుట్టిన తేదీని 1959 ఆగస్టు 14గా పరిగణనలోకి తీసుకుంటే అతను రైతుబీమా పరిహారానికి అనర్హుడు అవుతున్నాడు. దీంతో మహ్మద్‌ నజీర్‌ భార్య మహ్మద్‌ షాహీన్‌ బేగం సంగారెడ్డి జిల్లా వినియోగదారుల వివాదాల కమిషన్‌లో ఫిర్యాదు చేశారు. ఫిర్యాదుపై విచారణ జరిపిన కమిషన్‌ బాధితురాలికి అనుకూలంగా తీర్పు చెప్పింది. అధికారులు చేసిన తప్పిదానికి లబ్ధిదారులను ఎందుకు బాధ్యులను చేస్తారని ప్రశ్నించింది. ఇలాంటి తప్పిదాలను సాకుగా చూపి ఇన్సూరెన్స్‌ను తిరస్కరించొద్దని హితవు పలికింది. ఇలా చేస్తే అర్హులకు ప్రయోజనాలు అందవని, ఫలితంగా ప్రభుత్వం నష్టపోతుందని కమిషన్‌ పేర్కొంది.

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైతు బీమా పథకాన్ని 2018లో ప్రవేశపెట్టింది. 18 నుంచి 59 సంవత్సరాలు నిండిన రైతులను (భూమి ఉన్నవాళ్లను) దీనికి అర్హులుగా ప్రకటించింది. ప్రతి సంవత్సరం రైతుల తరఫున ప్రభుత్వమే ఎల్‌ఐసీకీ ప్రీమియం చెల్లిస్తోంది. రైతు ఏ కారణంగా చనిపోయినా 5 లక్షల రూపాయల పరిహారం అందిస్తోంది. రైతు చనిపోయిన వారం పది రోజుల్లోనే బీమా సొమ్మును నామినీ బ్యాంక్‌ అకౌంట్‌లో జమ చేస్తోంది. ఆధార్‌ కార్డులో నమోదైన పుట్టిన తేదీనే లెక్కలోకి తీసుకుంటోంది. 59 ఏళ్లు నిండినవారికి బీమా చెల్లించట్లేదు.