Site icon NTV Telugu

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఘోర రోడ్డుప్రమాదం.. నలుగురు మృతి

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో శుక్రవారం ఉదయం ఘోర రోడ్డుప్రమాదం చోటుచేసుకుంది. కొత్తగూడెం జిల్లా చండ్రుగొండ మండలం తిప్పనపల్లి వద్ద కూలీలతో వెళ్తున్న ట్రాలీని బొగ్గు టిప్పర్ ఢీకొన్న ఘటనలో నలుగురు కూలీలు మృతి చెందారు. వివరాల్లోకి వెళ్తే… చండ్రుగొండ మండలంలోని సుజాతనగర్‌కు చెందిన పలువురు కూలీలు అన్నపరెడ్డిపల్లి మండలానికి వరినారు తీసేందుకు బొలెరో వాహనంలో బయలుదేరి వెళ్తున్నారు. అయితే తిప్పనపల్లి వద్ద వీరు ప్రయాణిస్తున్న వాహనాన్ని ఎదురుగా బొగ్గు లోడుతో వస్తున్న టిప్పర్ లారీ ఢీకొట్టింది.

Read Also: నిరుపేదలకు శుభవార్త.. ప్రారంభానికి సిద్ధమవుతున్న సర్కారు ఇళ్లు

ఈ ప్రమాదంలో ఇద్దరు మహిళలు అక్కడికక్కడే మృతి చెందారు. మరో 10 మంది కూలీలు తీవ్రంగా గాయపడ్డారు. వారిని ఆస్పత్రికి తీసుకెళ్తుండగా మరో ఇద్దరు మృతి చెందారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. కొత్తగూడెం డీఎస్పీ వెంకటేశ్వరబాబు, సీఐ నాగరాజు ఘటనా స్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాస్పత్రికి తరలించారు.

Exit mobile version