CM Revanth Reddy : మూసీ, మెట్రోపై రగడ.. కిషన్ రెడ్డిని టార్గెట్ చేసిన సీఎం

  • మూసీ ప్రక్షాళనకు అడ్డంకులు సృష్టిస్తున్నారని విమర్శ
  • మెట్రో, ఆర్ఆర్ఆర్‌పై కేంద్ర మంత్రిని నిలదీత
  • ధాన్యం కొనుగోళ్లపై బీజేపీని ప్రశ్నించిన సీఎం
  • జూన్ 15 తర్వాత సమాధానం చెబుతామంటూ హెచ్చరిక
Revanth Reddy

Revanth Reddy

CM Revanth Reddy : హైదరాబాద్‌ నగర , తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి కేంద్ర మంత్రి జి. కిషన్ రెడ్డి మోకాలడ్డుతున్నారని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. శంకుస్థాపనల వేదికగా కేంద్ర మంత్రిపై విమర్శల జడివాన కురిపించిన సీఎం, తెలంగాణ ప్రయోజనాల కోసం కేంద్రంతో పోరాడాల్సిన బాధ్యత కిషన్ రెడ్డికి లేదా అని నిలదీశారు. రాజకీయాలకు అతీతంగా నగరాన్ని అభివృద్ధి చేయడానికి తాను సిద్ధంగా ఉన్నానని, అయితే కేంద్రంలో మంత్రిగా ఉండి కూడా కిషన్ రెడ్డి రాష్ట్ర కాళ్లల్లో కట్టెలు పెట్టి ఆపుతున్నారని మండిపడ్డారు.

మూసీ కాలుష్యం – ప్రక్షాళనకు అడ్డంకులు

మూసీ నది మురికి కారణంగా పరిసర ప్రాంతాల్లో భూముల ధరలు పెరగడం లేదని, నల్గొండ జిల్లాలో ఈ కాలుష్యం వల్ల ప్రజలు తీవ్రమైన అనారోగ్య సమస్యల బారిన పడుతున్నారని సీఎం ఆవేదన వ్యక్తం చేశారు. అక్కడి ఆడబిడ్డలు కడుపుకోతకు గురవుతున్నారని, అందుకే నల్గొండ ప్రజల పిలుపు మేరకు తాను గతంలో పాదయాత్ర చేశానని గుర్తు చేశారు. మూసీ ప్రక్షాళనలో భాగంగా ఇళ్లు కోల్పోయే పేదలకు కొత్త ఇళ్లు ఇస్తామని, వారి పిల్లలకు చదువు చెప్పిస్తామని ప్రభుత్వం ముందుకు వస్తుంటే ప్రతిపక్షాలు అడ్డుపడుతున్నాయని విమర్శించారు. కేంద్ర మంత్రిగా ఉన్న వ్యక్తి (కిషన్ రెడ్డి) కూడా ఈ ప్రాజెక్టుకు అడ్డంకులు సృష్టిస్తున్నారని దుయ్యబట్టారు. నాగోల్ నుంచి గౌరెల్లి వరకు ఫేజ్-2 లో భాగంగా మూసీ ప్రక్షాళన చేపడతామని, దీనికి సంబంధించిన కార్యాచరణ 100 రోజుల్లోనే మొదలవుతుందని సీఎం స్పష్టం చేశారు.

×
×
Ad

మెట్రో, రీజనల్ రింగ్ రోడ్డుకు కేంద్ర మంత్రి మోకాలడ్డు

హైదరాబాద్ మెట్రో రైలు వ్యవస్థ దేశంలో ప్రస్తుతం 9వ స్థానానికి పడిపోయిందని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. మెట్రోను మరింత విస్తరించాల్సిన అవసరం ఎంతైనా ఉందని, అన్ని అనుమతులు వచ్చాక కూడా కిషన్ రెడ్డి తన అధికారంతో దీనిని ఆపుతున్నారని ఆరోపించారు. రీజనల్ రింగ్ రోడ్డు (RRR) వస్తే తెలంగాణ ప్రపంచంతోనే పోటీ పడే అవకాశం ఉంటుందని, దీని కోసం తాను గత రెండున్నరేళ్లుగా 50 సార్లు ఢిల్లీకి వెళ్లి ప్రధాని మోదీని కలిశానని చెప్పారు. “హైదరాబాద్ ప్రజలు కిషన్ రెడ్డికి ఓట్లు వేయలేదా? మెట్రోకు అనుమతులు తెచ్చే బాధ్యత, మూసీకి నిధులు తీసుకువచ్చే బాధ్యత ఆయనకు లేదా?” అని సీఎం నిలదీశారు. అభివృద్ధి కోసం కేంద్ర మంత్రుల దగ్గరకు తనను తీసుకువెళ్లడానికి కూడా కిషన్ రెడ్డి వెనుకాడుతున్నారని విమర్శించారు.

ధాన్యం కొనుగోళ్లు – తుమ్మిడిహట్టి వివాదం

తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే రికార్డు స్థాయిలో 70 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేసిందని, మిగిలిన 25 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కేంద్రంతో కొనుగోలు చేయించే బాధ్యతను కిషన్ రెడ్డి ఎందుకు తీసుకోవడం లేదని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. అలాగే తుమ్మిడిహట్టి బ్యారేజ్ నిర్మాణంపై చర్చించడానికి మహారాష్ట్ర ముఖ్యమంత్రి తప్పించుకు తిరుగుతున్నారని, దీనికి కిషన్ రెడ్డి వైఫల్యమే కారణమని ఆరోపించారు. బిజెపిలో ఉంటూనే చీకట్లో ఇవతలి వాళ్లతో (బీఆర్ఎస్) కిషన్ రెడ్డి కుమ్మక్కు రాజకీయాలు చేస్తున్నారని, గతంలో ఇలాంటి రాజకీయాలు చేసినందుకే ప్రజలు ఆయనను ఓడించారని గుర్తు చేశారు.

కిషన్ రెడ్డికి గండపెండేరం తొడుగుతాం.. 15 తర్వాత సంగతి చెప్తాం

“తెలంగాణ ప్రజలతో గోకున్నోడు ఎవరూ బాగుపడినట్లు లేదు కిషన్ రెడ్డి.. ఈ నెల 15వ తేదీ తర్వాత బరాబర్ నీ సంగతి చెప్తాం” అంటూ సీఎం రేవంత్ రెడ్డి తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. కిషన్ రెడ్డి ఇకనైనా పనికిమాలిన ఉపన్యాసాలు ఆపి, రాష్ట్ర ప్రగతికి సహకరించాలని సూచించారు. కేంద్రం నుండి రాష్ట్రానికి రావలసిన అన్ని ప్రాజెక్టులు, నిధులను తీసుకువచ్చి సహకరిస్తే.. ఎల్బీ స్టేడియంలో కిషన్ రెడ్డికి తానే స్వయంగా ‘గండపెండేరం’ (సన్మాన సత్కారం) తొడుగుతానని సీఎం ప్రకటించారు.

ఎన్నికల సమయంలో మాత్రమే రాజకీయం చేద్దామని, మిగిలిన సమయంలో కష్టపడి హైదరాబాద్‌ను అంతర్జాతీయంగా అభివృద్ధి చేసుకుందామని పిలుపునిచ్చారు. స్థానిక ఎమ్మెల్యేలు ఏ పార్టీలో ఉన్నా సరే, వారితో కలిసి పనిచేసి నిధులు కేటాయించే బాధ్యత తనదేనని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పునరుద్ఘాటించారు.