Site icon NTV Telugu

Revanth Reddy: తండ్రీకొడుకులకు జనం మధ్య తిరిగే పరిస్థితి లేదు

Revanth Reddy On Ktr

Revanth Reddy On Ktr

Revanth Reddy Satires On Minister KTR and CM KCR: సిరిసిల్ల జిల్లాలో మంత్రి కేటీఆర్ పర్యటనను వీఆర్ఏలు అడ్డుకోవడం, అలాగే భద్రాచలంలో వరద బాధితుల నుంచి సీఎం కేసీఆర్‌కు నిరసన ఎదురైన ఉదంతాలపై టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి తనదైన శైలిలో స్పందించారు. కేటీఆర్‌ను ట్విటర్ పిట్టగా అభివర్ణించిన ఆయన.. నిన్న మెట్‌పల్లిలో చెరుకు రైతుల సెగ, ఇవాళ సిరిసిల్లలో వీఆర్ఏల సెగ తగిలిందని అన్నారు. అటు.. భద్రాచలంలో వరద బాధితుల నుంచి కేసీఆర్‌కు నిరసన ఎదురైందని వెల్లడించారు. ఇప్పుడు తండ్రీకొడుకులకు జనం మధ్యం స్వేచ్ఛగా తిరిగే పరిస్థితి లేదని, బంగారు తెలంగాణ క్షేత్రంలో ఇదే వాస్తవ పరిస్థితి అని రేవంత్ వివరించారు.

కాగా.. గత రెండు రోజుల నుంచి రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట వీఆర్ఏలు నిరసనలు తెలియజేస్తున్నారు. ఓ సమీక్ష నిమిత్తం మంత్రి కేటీఆర్ ఈరోజు (23-07-22) కలెక్టరేట్‌కు వచ్చారు. సమీక్ష అనంతరం కేటీఆర్ కాన్వాయ్ కలెక్టరేట్ నుంచి బయటికి వెళ్తుండగా..50 మంది వీఆర్ఏలు ఒక్కసారిగా దూసుకొచ్చారు. తమను విధుల్లోకి తీసుకోవాలని, అలాగే పేస్కేల్ పదోన్నతులు కల్పించాలని నినాదాలు చేశారు. కేటీఆర్ కాన్వాయ్ ముందు బైఠాయించే ప్రయత్నమూ చేశారు. ఈ క్రమంలోనే ఉద్రిక్తత చోటు చేసుకుంది. పోలీసులు రంగ ప్రవేశం చేసి, పరిస్థితిని అదుపు చేశారు. కొందరు వీఆర్ఏలను అరెస్ట్ చేశారు.

Exit mobile version