Site icon NTV Telugu

Revanth Reddy: కేసీఆర్.. భోజనానికి ముందు ఆత్మపరిశీలన చేసుకో

Revanth Reddy On Kcr

Revanth Reddy On Kcr

Revanth Reddy Questions KCR On Foods In Schools and Colleges: ఇటీవల పాఠశాలలు, కళాశాలల్లో భోజనాలు చేసి.. విద్యార్థులు అస్వస్థతకు గురవుతున్న సంఘటనలు తరచూ వెలుగు చూస్తున్నాయి. హనుమకొండ జిల్లాలోని మహాత్మా జోతిరావుపూలే బాలికల గురుకుల పాఠశాలలో కలుషిత నీరు, ఆహారం కారణంగా ఎనిమిది మంది విద్యార్థులు ఆసుపత్రిపాలయ్యారు. తాజాగా పప్పులో వానపామునే వడ్డించే ఘటన తెరమీదకొచ్చింది. రాత్రి చేసిన కూరనే ఉదయం వడ్డించడం, కడగని పాత్రల్లోనే భోజనాలు చేయడం లాంటి సంఘటనలు వెలుగు చూశాయి. ఫలితంగా.. వందలాది మంది విద్యార్థినులు అస్వస్థతకు గురయ్యారు.

ఈ నేపథ్యంలోనే టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ట్విటర్ మాధ్యమంగా తెలంగాణ సీఎం కేసీఆర్‌పై నిప్పులు చెరిగారు. ‘పురుగలన్నం పెట్టి పేద పిల్లల ప్రాణాలతో చెలగాటమాడే సర్కారును ఏ పదాలతో విమర్శించాలి?’ అని ఆయన ఫైరయ్యారు. కేసీఆర్‌కు భోగాలు తప్ప త్యాగాలేమీ తెలియవని.. ఆయనకు, ఆయన కుటుంబ సభ్యులకు పిల్లల ప్రాణాల విలువ తెలుసా? అంటూ నిలదీశారు. పేద బిడ్డలకు నాణ్యమైన బుక్కెడు బువ్వ పెట్టలేని పాలన దేనికోసమని ప్రశ్నించారు. భోజనం తినేముందు ఓసారి ఆత్మపరిశీలన చేసుకోమ్మని కేసీఆర్‌ని రేవంత్ రెడ్డి సూచించారు. ఈ ట్వీట్‌కు విద్యార్థినులు అస్వస్థతకు గురైన సంఘటనల వార్తల్ని ప్రచురించిన ఓ వార్తా పత్రిక పేజీని షేర్ చేశారు.

Exit mobile version