Revanth Reddy fires on KCR: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, ఆయన కుటుంబం మీద టీ పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి తీవ్రస్థాయిలో ఫైర్ అయ్యారు. మేడ్చల్ జిల్లా కేసీఆర్ దత్తత గ్రామం మూఢుచింతలపల్లి లక్ష్మాపూర్ లో రచ్చబండ కార్యక్రమంలో భాగంగా ఆయన మాట్లాడుతూ గతంలో కుమ్మరి ఎల్లవ్వ ఇంటికి వచ్చి చూస్తే.. మురికి నీరు అంతా ఆ ఇంట్లోకే వెళ్ళేదని, కేసీఆర్ ఫామ్ హౌస్ కు వెళ్ళడానికి మంచి దారి వేసుకున్నాడని అన్నారు. రోడ్డు ఎల్లవ్వ ఇల్లు కంటే 6 ఫీట్లు ఎత్తు కట్టి ఎల్లవ్వ ఇల్లును ముంచారని, రోడ్డు బాధితులకు న్యాయం చేయాలని ఎంపీగా కలెక్టర్ కు చెప్పినా పట్టించుకోలేదని విమర్శించారు. ఇక్కడి బీఆర్ఎస్ నాయకులకు భూ కబ్జాలు తప్ప పేదల బాధలు పట్టవని పేర్కొన్న ఆయన అందుకే మా నాయకులకు చెప్పి ఎల్లవ్వకు ఇందిరమ్మ ఇల్లు కట్టించామని అన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే రాష్ట్రం మొత్తం పేదలకు ఇందిరమ్మ ఇళ్లు కట్టించే బాధ్యత కాంగ్రెస్ తీసుకుంటుందన్న ఆయన గతంలో రాష్ట్రంలో 25 లక్షల ఇందిరమ్మ ఇళ్లు కట్టించిన ఘనత కాంగ్రెస్ ది అని అందుకే నేను కేసీఆర్ కు సవాల్ విసిరానని అన్నారు. ఎక్కడెక్కడ ఇందిరమ్మ ఇళ్లు కట్టామో అక్కడే మేం ఓట్లు అడుగుతామన్న రేవంత్ ఎక్కడ మీరు డబుల్ బెడ్రూం ఇళ్లు కట్టారో అక్కడే మీరు ఓట్లు అడగండని సవాల్ చేశారు. సీఎం కేసీఆర్, మంత్రి మల్లారెడ్డికి సవాల్ విసురుతున్నా, మీ ఒంట్లో చీము, నెత్తురు ఉంటే… మీసమున్న మగాళ్లు అయితే నా సవాల్ ను స్వీకరించాలని అన్నారు. ఈ సవాల్ ను స్వీకరిస్తే ఏ నియోజకవర్గంలో మీకు డిపాజిట్లు రావని ఆయన అన్నారు. అయినా మీకు డిపాజిట్లు వస్తే మేం గుండు కొట్టించుకుంటామని పేర్కొన్న ఆయన కాంగ్రెస్ అధికారంలోకి రాగానే కేసీఆర్ కుటుంబానికి చర్లపల్లి జైల్లో డబుల్ బెడ్రూం ఇల్లు కట్టిస్తామని అన్నారు. ఇక కాంగ్రెస్ అధికారంలోకి రాగానే ఇందిరమ్మ ఇళ్లు కట్టుకునే పేదలకు రూ.5లక్షలు అందిస్తామని, రూ. 5 లక్షల వరకు ఆరోగ్యశ్రీ ద్వారా పేదలకు ఉచిత వైద్యం అందిస్తామని అన్నారు. రైతులకు రూ.2 లక్షలు రుణమాఫీ చేసి రైతులను ఆదుకుంటామన్న ఆయన 2 లక్షల ప్రభుత్వ ఉద్యోగ ఖాళీలను ఏడాదిలోగా భర్తీ చేస్తామన్న రేవంత్ రూ.500 లకే గ్యాస్ సిలిండర్ అందించి ఆడబిడ్డలను ఆదుకుంటామని అన్నారు.
Revanth Reddy: కాంగ్రెస్ అధికారంలోకి రాగానే కేసీఆర్ కుటుంబానికి చర్లపల్లి జైల్లో డబుల్ బెడ్రూం ఇల్లు

Revanth Reddy Slams Kcr