Site icon NTV Telugu

Revanth Reddy: కేంద్ర ఎన్నికల సంఘంపై ఫైర్.. టీఆర్ఎస్ స్థానాన్ని మార్చాలని డిమాండ్

Revanth Reddy

Revanth Reddy

Revanth Reddy Fires On Central Election Commission For Changing TRS Place In Ballet Paper: రాజ్యాంగబద్ధ సంస్థ కేంద్ర ఎన్నికల సంఘం, ఎన్నికలు అధికారులు పూర్తిగా విఫలమయ్యారని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు. బ్యాలెట్‌లో పేర్లు పొందుపరిచే విషయంలో.. మునుగోడు రిటర్నింగ్ అధికారి నాలుగో స్థానంలో ఉండాల్సిన టీఆరెస్‌ను రెండో స్థానంలో ఉంచారన్నారు. జాతీయ పార్టీల అభ్యర్థుల పేర్లను ముందుంచి.. ఆ తర్వాత ప్రాంతీయ పార్టీల అభ్యర్థుల పేర్లను పెట్టాలన్నారు. టీఆర్ఎస్ ఇంకా జాతీయ పార్టీ కాలేదని.. పైగా అభ్యర్థి టీఆర్ఎస్ తరఫునే నామినేషన్ వేశారని అన్నారు. బ్యాలెట్ పేపర్‌ను మరోసారి పరిశీలించి.. కేంద్ర ఎన్నికల సంఘం నియమావళి ప్రకారం సీరియల్ నంబర్ కేటాయించాలని డిమాండ్ చేశారు. అలాగే.. అనుమతి లేని వాహనాలను కూడా సీజ్ చేయాలని కోరారు.

కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ర్యాలీల్లో అనుమతి లేని వాహనాలు తిరుగుతున్నాయని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. అనుమతి లేని వాహనాలు బహిరంగంగా తిరుగుతున్నా.. కేంద్ర ఎన్నికల సంఘం చర్యలు తీసుకోకుండా కళ్లు మూసుకుందా? అని ప్రశ్నించారు. అందరికీ ఒకే రకమైన నియమావళిని అమలు చేయాలన్న ఆయన.. ఎన్నికల నిబంధనలు కేసీఆర్‌కు వర్తించవా? అని నిలదీశారు. మందు సరఫరా చేసిన మంత్రులపై క్రిమినల్ కేసులు పెట్టాలన్నారు. మంత్రులు ప్రభుత్వ వాహనాలలో వచ్చి ప్రచారం చేస్తున్నారని.. ఇది నూటికి నూరు శాతం నిబంధనలకు విరుద్ధమని ఆగ్రహం వ్యక్తం చేశారు. గ్రామాల్లో కాంగ్రెస్ కార్యకర్తలపై బీజేపీ వాళ్లు నిరంతరం దాడులు చేస్తున్నారని ఆరోపించారు. స్వయంగా రాజగోపాల్ రెడ్డి తమ కార్యకర్తలపై బెదిరింపులకు పాల్పడ్డారని.. అయినా పోలీసులు చోద్యం చూస్తున్నారని రేవంత్ రెడ్డి మండిపడ్డారు. కనీసం ఎన్నికల అధికారులు కూడా చర్యలు తీసుకోవట్లేదని వాపోయారు.

Exit mobile version