విద్యుత్ పంపిణీ సంస్థల చార్జీల పెంపు ప్రతిపాదనలను చర్చకు తావు లేకుండా ఈఆర్సీ తిరస్కరించాలని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అన్నారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడతూ.. రాష్ట్ర విభజన తర్వాత డిస్కామ్‌ల, ట్రాన్స్క్ లలో ఈఆర్సీ నిర్వహణలో లోపాలు ఉన్నాయన్నారు. రాష్ట్ర విభజన సమయంలో విద్యుత్ పంపిణీ సంస్థల అప్పులు 11 వేల కోట్లు ఉంటే.. 8 వేల 9 వందల కోట్ల అప్పు భారం ను కేంద్రం తీసుకుందని ఆయన వెల్లడించారు. ఉదయ్ స్కీమ్‌లో చేరడంతో డిస్కామ్ ల అప్పు 2 వేల కోట్లకు చేరుకుందన్నారు.
ఇవాళ రాష్ట్ర విద్యుత్ పంపిణీ సంస్థల అప్పులు 60 వేల కోట్లకు చేరుకుందని ఆయన అన్నారు. డిస్కామ్ లు రాష్ట్రంలో దివాళా తీసాయి… రాష్ట్ర ప్రభుత్వం నుంచి బకాయిలు రాబట్టుకోకపోవడమే ఇందుకు కారణమని ఆయన మండిపడ్డారు. విద్యుత్ పంపిణీ చేస్తున్న కరెంటులో 30 శాతం వినియోగదారు రాష్ట్ర సర్కార్ అని ఆయన అన్నారు. ఏడాదికి డిస్కామ్ లకు రాష్ట్ర ప్రభుత్వం చెల్లించాల్సిన 16 వేల కోట్లలో …సర్కార్ కేవలం 5 వేల 6 వందల కోట్లు మాత్రమే ఇస్తుందని ఆయన తెలిపారు.
