Revanth Reddy Chitchat With Students In Jayashankar Bhupalapalli: పేదలకు మంచి జరగాలంటే.. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాల్సిందేనని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. హాథ్ సే హాథ్ జోడో యాత్రలో భాగంగా జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని కాసీంపల్లి వద్ద విద్యార్థులతో రేవంత్ ముచ్చటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ ఉద్యమం అంటే విద్యార్థుల ఉద్యమం అని, విద్యార్థులు కేవలం చదువులకే పరిమితం కాకుండా సమాజం కోసం పోరాడారని అన్నారు. మలి తెలంగాణ ఉద్యమం విద్యార్థుల వల్లే ఉవ్వెత్తున ఎగసిందని, కేవలం రాజకీయ నాయకుల వల్లే తెలంగాణ ఏర్పడలేదని చెప్పారు. విద్యార్థుల త్యాగాల పునాదులపై తెలంగాణ ఏర్పడిందని ఉద్ఘాటించారు. ఆడపిల్లల హాస్టళ్లలో మౌళిక వసతులు లేవని, ఫీజు రీయింబర్స్‌మెంట్ రాకపోవడం వల్ల సర్టిఫికెట్లు తీసుకునేటప్పుడు ఇబ్బంది పడుతున్నామని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారని తెలిపారు. తమకు ఉద్యోగ, ఉపాధి కల్పించాలని విద్యార్థులు కోరుతున్నారన్నారు. రాష్ట్రంలో మహిళలకు భద్రత లేదని ఆడబిడ్డలు ఆందోళన చెందుతున్నారన్నారు. విద్యార్థులతో మాట్లాడిన తర్వాత రాష్ట్రంలో పాలనను కేసీఆర్ గాలికొదిలేశారని అర్థమైందని అన్నారు.
Read Also: Partner Exchange: క్విడ్ ప్రోకో అంటే ఇదేనేమో.. భర్తలను మార్చుకున్న భార్యలు
కేసీఆర్ తెలంగాణ మోడల్ అంటే.. మినిమం గవర్నెన్స్ మాక్సిమం పాలిటిక్స్ అని రేవంత్ రెడ్డి అభివర్ణించారు. దేశం ఆకలి తీర్చేందుకు ‘హరిత విప్లవం’ తీసుకొచ్చింది కాంగ్రెస్ పార్టీనేనన్నారు. ప్రభుత్వ రంగ సంస్థలను ఏర్పాటు చేసి ఉద్యోగ, ఉపాధి అవకాశాలను కల్పించిందని.. బీడీఎల్, బీహెచ్ఈఎల్, రైల్వే, ఎయిర్ ఇండియా లాంటి సంస్థలు ఏర్పాటు చేసిందని తెలిపారు. రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలతో మినహాయింపు పొందిన పరిశ్రమల్లో కూడా రిజర్వేషన్లు కల్పించే అంశాన్ని కాంగ్రెస్ ఆలోచిస్తోందన్నారు. కాంగ్రెస్ అభివృద్ధి చేసిన సంస్థలను ప్రధాని మోడీ ప్రైవేట్‌కు అప్పగించారని.. లాభాలు వచ్చే సంస్థలను ప్రైవేట్ వ్యక్తులకు తక్కువ ధరకే అమ్మేస్తున్నారని ఆరోపించారు. ఇది అత్యంత ప్రమాదకరమైన పరిస్థితి అని పేర్కొన్నారు. ప్రభుత్వ సంస్థలను ప్రైవేట్‌పరం చేస్తే, రిజర్వేషన్ల అమలు జరగదన్నారు. కాంగ్రెస్ హయాంలో రాష్ట్రంలో 30వేల స్కూల్స్ తెరిస్తే.. కేసీఆర్ ప్రభుత్వంలో 6వేల 354 సింగిల్ టీచర్ పాఠాశాలలు మూసివేశారన్నారు. దీంతో మారుమూల ప్రాంతాల విద్యార్థులకు చదువు దూరమైందన్నారు. కేసీఆర్ పేదలకు విద్యను దూరం చేసే కుట్ర చేస్తున్నారని ఆరోపణలు చేశారు. ప్రభుత్వ యూనివర్సిటీలను కేసీఆర్ ప్రభుత్వం నిర్వీర్యం చేస్తోందని, ప్రైవేట్ యూనివర్సిటీలు తెరిచి విద్యను వ్యాపారం చేస్తున్నారని, ప్రయివేటు యూనివర్సిటీల్లో రిజర్వేషన్లు ఉండవని వెల్లడించారు. బిశ్వాల్ కమిటీ 1,91,354 ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేయాలని చెప్పిందని.. కానీ రిటైర్‌మెంట్ వయసు పెంచి, ఉద్యోగ ఖాళీలను కేసీఆర్ ప్రభుత్వం భర్తీ చేయలేదని మండిపడ్డారు.
Read Also: Samantha Ruth Prabhu Injured Live: వెబ్ సిరీస్ షూటింగ్.. సమంతకు గాయాలు
తమ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక అన్ని విద్యా సంస్థల్లో 25 శాతం రిజర్వేషన్ ఇచ్చేలా విధానం తీసుకొస్తామని రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు. ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకాన్ని అమలు చేస్తామని, 2 లక్షల ప్రభుత్వ ఉద్యోగ ఖాళీలు భర్తీ చేస్తామని, శాఖలవారీగా ఉద్యోగ క్యాలెండర్ ప్రకారం ఖాళీలు భర్తీ చేస్తామని మాటిచ్చారు. తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న విద్యార్థుల కేసులను ఒక్క కలం పోటుతో తొలగిస్తామని.. 10 శాతం పైగా నిధులను విద్య కోసం ఖర్చు చేస్తామని వాగ్దానం చేశారు. పరిపాలనలో సమూల మార్పులు తెచ్చి, హాస్టళ్లను ఆదర్శంగా తీర్చిదిద్దుతామన్నారు. రైతుల కోసం కాంగ్రెస్ ఎంఎస్పీ విధానం తీసుకోస్తే.. రాష్ట్ర ప్రభుత్వం ఆ చట్టానికి తూట్లు పొడిచిందన్నారు. అధికారంలోకి రాగానే వరంగల్ డిక్లరేషన్‌ను అమలు చేసి, రైతులను ఆదుకుంటామన్నారు. రాచరికపు పోకడలను ఇంకెంత కాలం భరిద్దాం? విద్యార్థులు పోరాట పటిమను అలవర్చుకోవాలని పిలుపునిచ్చారు. మీ భవిష్యత్తు మీ చేతిలోనే ఉందని విద్యార్థులను ఉద్దేశించి చెప్పిన రేవంత్ రెడ్డి.. విద్యార్థులు తలచుకుంటే కేసీఆర్‌ను శంకరగిరి మాన్యాలు పట్టిస్తారన్నారు.