తెలంగాణ ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి అరుదైన గౌరవాన్ని దక్కించుకున్నారు. కేరళకు చెందిన దిగ్గజ కాంగ్రెస్ నేత, దివంగత ఆర్యదాన్ ముహమ్మద్ స్మారకార్థం ఆర్యదాన్ ముహమ్మద్ ఫౌండేషన్ అందజేసే ప్రతిష్టాత్మక ‘ఆర్యదాన్ ముహమ్మద్ – 2026’ బెస్ట్ పబ్లిక్ సర్వెంట్ (ఉత్తమ ప్రజా సేవకుడు) అవార్డుకు సీఎం రేవంత్ రెడ్డి ఎంపికయ్యారు. తెలంగాణలో రైతులు, వెనుకబడిన వర్గాలు (బీసీలు) , సామాన్య ప్రజల సంక్షేమానికి ముఖ్యమంత్రి చేపట్టిన వినూత్న కార్యక్రమాలు, దూరదృష్టి గల పరిపాలనా వైఖరికి ప్రాధాన్యమిస్తూ ఈ గౌరవ పురస్కారాన్ని ప్రకటిస్తున్నట్లు ఫౌండేషన్ వర్కింగ్ ఛైర్మన్, నిలంబూర్ ఎమ్మెల్యే ఆర్యదాన్ షౌకత్ వెల్లడించారు.
రైతు, బీసీ సంక్షేమ పాలనకు ప్రాధాన్యత.. జ్యూరీ ప్రశంసలు
ఈ అవార్డు ఎంపిక ప్రక్రియలో ఎంపీ బెన్నీ బెహనన్, కేరళ రెవెన్యూ శాఖ మంత్రి ఎ.పి. అనిల్‌కుమార్ , ప్రముఖ మేధావి కల్పేట్టా నారాయణన్ సభ్యులుగా ఉన్న ఉన్నత స్థాయి జ్యూరీ వ్యవహరించింది. తెలంగాణను ప్రగతిపథంలో నడిపించడంలో సీఎం రేవంత్ రెడ్డి కనబరిచిన దూరదృష్టి, ప్రజాస్వామిక విలువల పట్ల ఆయనకున్న అపారమైన నిబద్ధతను జ్యూరీ ప్రత్యేకంగా కొనియాడింది. ప్రజా సంక్షేమమే పరమావధిగా సాగుతున్న పాలనకు గుర్తింపుగానే ఈ అంతర్రాష్ట్ర పురస్కారం దక్కిందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
రేపే అవార్డు ప్రదానోత్సవం.. ఏఐసీసీ కీలక నేతల హాజరు
ఆర్యదాన్ ముహమ్మద్ నాల్గవ వర్ధంతి సందర్భాన్ని పురస్కరించుకుని కేరళలోని నిలంబూర్‌లో శుక్రవారం ఉదయం 10 గంటలకు నిర్వహించే ప్రత్యేక కార్యక్రమంలో ఈ అవార్డును ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి అత్యంత ఘనంగా ప్రదానం చేయనున్నారు. ఈ పురస్కారం కింద రూ. లక్ష నగదు బహుమతితో పాటు విశేష ప్రశంసా పత్రం, జ్ఞాపికను అందజేస్తారు. ఈ వేడుకలో ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి (సంస్థాగత) కె.సి. వేణుగోపాల్ ముఖ్య అతిథిగా హాజరై, ఆర్యదాన్ ముహమ్మద్ స్మారక ఉపన్యాసం చేయనున్నారు.
ప్రజానేత ఆర్యదాన్ ముహమ్మద్ స్మారకార్థం ఏర్పాటు
కేరళ రాజకీయాల్లో చెరగని ముద్ర వేసిన సీనియర్ కాంగ్రెస్ నేత ఆర్యదాన్ ముహమ్మద్ ఎనిమిది సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికవడమే కాకుండా, వివిధ మంత్రివర్గాల్లో నాలుగుసార్లు కీలక శాఖలకు మంత్రిగా సమర్థవంతమైన సేవలు అందించారు. అద్భుతమైన పార్లమెంటేరియన్‌గా, కార్మిక వర్గ ఛాంపియన్‌గా, నిజాయితీ , లౌకిక విలువలకు మారుపేరుగా కేరళ ప్రజల గుండెల్లో నిలిచిపోయిన ఆయన స్మారకార్థం ఈ అవార్డును నెలకొల్పారు. అటువంటి మహనీయుడి పేరిట ఏర్పాటైన ఉత్తమ ప్రజా సేవకుడి పురస్కారానికి తెలంగాణ ముఖ్యమంత్రి ఎంపిక కావడం విశేషం.

