Bobba Navatha Reddy : శేరిలింగంపల్లి నియోజకవర్గంలో రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీజేపీ.. రెండు పార్టీలకూ వరుసగా కీలక నేతల రాజీనామాలు షాక్ ఇస్తున్నాయి. తాజాగా బీజేపీ సీనియర్ నాయకురాలు, మాజీ కార్పొరేటర్ బొబ్బ నవతా రెడ్డి ఆదివారం తన రాజీనామా లేఖను సోషల్ మీడియాలో పోస్టు చేశారు.
వ్యక్తిగత కారణాల వల్ల పార్టీని విడిచిపోతున్నట్లు పేర్కొంటూ, ఇంతకాలం సహకరించిన పార్టీ నేతలకు ధన్యవాదాలు తెలిపారు. ఇక కాంగ్రెస్ పార్టీలో కూడా అంతర్గత విభేదాలు తీవ్రతరం అవుతున్నాయి. ఆ పార్టీకి చెందిన మహిళా నాయకురాలు చంద్రిక గౌడ్ పార్టీని వీడడం ఆ విభేదాలను బహిర్గతం చేసింది. “తనను తన పార్టీ నేతలే వ్యక్తిగతంగా దూషిస్తూ, పనిగట్టుకుని నిందలు వేస్తున్నారు,” అని ఆమె సోషల్ మీడియాలో ఆవేదన వ్యక్తం చేశారు.
ఇటు రెండు జాతీయ పార్టీల్లోనూ రాజీనామాల పరంపర కొనసాగుతుండటంతో, శేరిలింగంపల్లిలో బీఆర్ఎస్ బలపడుతోందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. స్థానికంగా కాంగ్రెస్, బీజేపీలు అధికారంలో ఉన్నప్పటికీ, ఆ నియోజకవర్గంలో బీఆర్‌ఎస్ ప్రభావం ఇంకా గట్టిగానే ఉందని ప్రజలు చెబుతున్నారు. ఇప్పటికే బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు చెందిన పలువురు నేతలు అసంతృప్తిగా ఉన్నారని, త్వరలో మరింత మంది ప్రజాప్రతినిధులు కూడా పార్టీలు మారే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు.
