Rajagopal Reddy Fires On TRS Over Moinabad Far House Case: మొయినాబాద్ ఫాంహౌస్ వ్యవహారంపై కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. అది టీఆర్ఎస్ ఆడిన డ్రామా అని విమర్శించారు. అర్థ రూపాయికి కూడా అమ్ముడుపోని వారికి రూ.100 కోట్లు పెడతారా? అని ప్రశ్నించారు. ఆ ఎమ్మెల్యేలను తాము కాదు కదా.. ఏ పార్టీలోనూ రానివ్వరని ఎద్దేవా చేశారు. కేసీఆర్‌కు మతి భ్రమించి పిచ్చిపిచ్చిగా ప్రవర్తిస్తున్నారని, ఎన్నికలు వచ్చిన ప్రతీసారి ‘డబ్బు రాజకీయాలు’ చేస్తున్నారని ఆరోపించారు. ఎనిమిదేళ్లలో తెలంగాణలో బడుగు బలహీన వర్గాల బతుకులు బాగుపడలేదని.. రాష్ట్రంలో దుర్మార్గమైన పాలన నడుస్తోందని ధ్వజమెత్తారు. ప్రశ్నించే గొంతు లేకుండా.. 12 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలను కొనునగోలు చేసి, ప్రజాస్వామ్యాన్ని కేసీఆర్ ఖూనీ చేశారని ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఇటువంటి సీఎంకి సరైన జవాబు చెప్పాలని అన్నారు.
టీఆర్ఎస్‌లో రాజకీయాలు చేసే వారివి బానిస బతుకులని.. అవమానాలు భరించలేక బూర నర్సయ్య గౌడ్ ఆ పార్టీకి రాజీనామా చేశారని రాజగోపాల్ రెడ్డి పేర్కొన్నారు. ఒకప్పుడు ఎంతోమంది ఉద్యమకారులు పార్టీలో ఉండేవారని, ఇప్పుడు ఒక్కరు కూడా లేరని చెప్పారు. కేవలం ఒక ఎమ్మెల్యేను ఓడించేందుకు.. ఆలీబాబా 40 దొంగల ముఠా దిగిందని సెటైర్ వేశారు. నీ డబ్బు, నీ అధికారం కంటే ప్రజాశక్తి గొప్పదని హుజూరాబాద్ ప్రజలు నిరూపించారని నిప్పులు చెరిగారు. దురహంకార పాలనకు చరమగీతం పాడాలని పిలుపునిచ్చారు. బడుగు బలహీన వర్గాల కోసమే తెలంగాణ వచ్చిందని.. ప్రస్తుతం పేదవాడు ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లి చికిత్స చేయించుకునే పరిస్థితి లేదని వెల్లడించారు. యాదాద్రి భువనగిరి జిల్లాలోని చౌటుప్పల్ పట్టణంలో.. గురువారం నిర్వహించిన గౌడ ఆత్మీయ సమావేశంలో రాజగోపాల్ రెడ్డి ఈ విధంగా స్పందించారు.