Site icon NTV Telugu

Hyderabad: తొలకరి పలకరింపు… చ‌ల్ల‌బ‌డిన వాతావ‌ర‌ణం

Rain

Rain

ఆదివారం ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు ఎండలు దంచికొట్టాయి. దీంతో జనం ఉక్కపోతతో తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. మధ్యాహ్నం ఒక్కసారిగా వాతావరణం చల్లబడగా జనం ఉక్కపోత నుంచి ఊరట పొందారు. భాగ్య‌నంగ‌రంతో పాటు శివారు ప్రాంతాల్లో తేలిక‌పాటి జ‌ల్లులు కురిసాయి. జీడిమెట్ల, సూరారం, బహదూర్‌పల్లి, నేరేడ్‌మెట్‌, మల్కాజ్‌గిరి, సికింద్రాబాద్‌, బోయిన్‌పల్లి, తిరుమలగిరి, అల్వాల్‌, బేగంపేట, చిలుకలగూడ, మారేడ్‌పల్లి ప్రాంతాల్లో జ‌ల్లులు కురుసాయి. కీసరలో ఈదురుగాలులతో కూడిన వర్షం కురువగా.. ముందస్తు జాగ్రత్తగా విద్యుత్‌ సరఫరా నిలిపివేశారు.

ఇదిలా ఉండగా..ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లాలో ఆదివారం పిడుగుపాటుకు ఇద్దరు బలయ్యారు. నాగర్‌కర్నూల్‌ జిల్లా కల్వకుర్తి మండలం కురిమిద్ద గ్రామానికి చెందిన తిరుపతయ్య, చంద్రకళ దంపతులు తమ కుమారుడితో కలిసి పొలానికి వెళ్లారు. సాయంత్రం వర్షం కురవడంతో వారితో పాటు చుట్టుపక్క పొలాల్లో పని చేసుకుంటున్న కూలీలు సమీపంలో ఉన్న చెట్టు కిందకు చేరారు. అదే సమయంలో పిడుగు పడటంతో సాంబశివుడు అక్కడికక్కడే మృతి చెందాడు. ఐదుగురు గాయపడ్డారు. పరిస్థితి విషమంగా ఉన్న ఒక బాలుడిని ప్రాథమిక చికిత్స అనంతరం హైదరాబాద్‌కు పంపించారు.

నారాయణపేట జిల్లా మాగనూరు మండల కేంద్రానికి చెందిన కురువ పరమేశ్‌ గ్రామ శివారులో గొర్రెలను మేపుతుండగా పిడుగుపడి మృతి చెందాడు. కాగా, ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని పలు చోట్ల ఆదివారం ఉరుములు, మెరుపులతో వర్షం కురిసింది. గాలి దుమారం బీభత్సం సృష్టించింది. పలుచోట్ల చెట్లు, విద్యుత్‌ స్తంభాలు విరిగిపడ్డాయి. నల్లగొండ, మునుగోడులో మోస్తరు వాన పడింది. వరంగల్‌ జిల్లాలో ఆదివారం సాయంత్రం పలు చోట్ల గాలి దుమారంతో విద్యుత్‌ స్తంభాలు విరిగిపడ్డాయి. చెట్లు నేలకొరిగాయి. సంగెం మండలం గవిచర్లలో కరెంటు స్తంభాలు విరిగిపోయాయి. వరంగల్‌- నెక్కొండ రోడ్డులో వృక్షాలు నేలమట్టం కావడంతో వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి.

నేడు, రేపు రాష్ట్రంలో ఈదురు గాలులురాష్ట్ర వ్యాప్తంగా సోమ, మంగళవారాల్లో ఈదురు గాలులు వీచే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం సూచించింది. గంటకు 30-40 కి.మీ వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని.. అక్కడక్కడా ఉరుములు, మెరుపులతో వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది.

Exit mobile version