NTV Telugu Site icon

Rahul Gandhi: బీజేపీ, టీఆర్ఎస్ డ్రామాలాడుతూ.. ప్రజల్ని మభ్యపెడుతున్నాయి

Rahul Gandhi Speech

Rahul Gandhi Speech

Rahul Gandhi Fires On PM Narenda Modi & CM KCR: బీజేపీ, టీఆర్ఎస్ పార్టీలు అన్ని విషయాల్లోనూ ఒకదానికి మరొకటి సహకరించుకుంటున్నాయని.. ఆ రెండు పార్టీలు కలిసి డ్రామాలాడుతూ ప్రజల్ని మభ్యపెడుతున్నాయని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ పేర్కొన్నారు. భారత్ జోడో యాత్రలో భాగంగా హైదరాబాద్ ఓల్డ్ సిటీకి చేరుకున్న ఆయన.. అక్కడ నిర్వహించిన సభలో మాట్లాడారు. బీజేపీ, ఆర్ఎస్ఎస్ మన దేశంలో హింస, ద్వెషాన్ని పెంచి పోషిస్తున్నాయని ఆరోపించారు. ప్రజల మధ్య చిచ్చు పెట్టి, విభజించు పాలించు చేస్తున్నాయని చెప్పారు. అయితే.. తమ భారత్ జోడో యాత్రలో ద్వేషానికి ఎలాంటి తావు లేదన్నారు. లక్షలాది మంది ఎంతో ప్రేమ, ఆప్యాయతతో తన యాత్రను స్వాగతిస్తున్నారన్నారు. కాలుష్యంలో ఢిల్లీ మొదటి స్థానంలో ఉంటే.. అవినీతిలో తెలంగాణ ముందుందని తెలిపారు.

తెలంగాణలో తాను ఏడు రోజుల్లో అనేక వర్గాలతో మాట్లాడానని, ఎవరిని కదిలించినా సమస్యలతో కన్నీరు పెడుతున్నారని రాహుల్ గాంధీ అన్నారు. తెలంగాణ రైతుల కష్టాలను స్వయంగా తెలుసుకున్నానని, సాగు లాభదాయకంగా లేక వందలాది రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారన్నారు. ప్రజల కష్టాలను తెలుసుకోవాలన్నా, వినాలన్నా కేసీఆర్‌కి ఓపిక లేదని దుయ్యబట్టారు. ఉన్నత చదువులు చదివిన యువతకు ఉద్యోగాలు లేక ఇబ్బందులు పడుతున్నారని ధ్వజమెత్తారు. పెద్ద చదువులు చదివినా.. ఉద్యోగాలు లేక స్విగ్గీ, జోమటో లాంటి వాటిల్లో పనులు చేసుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. నిరుద్యోగులకు ఇచ్చిన హామీలను కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలు విస్మరించాయని విమర్శించారు. మోడీ తెచ్చిన నోట్ల రద్దు, జీఎస్టీ వల్ల చిన్న, మధ్య తరహా వ్యాపారులు రోడ్డున పడ్డారన్నారు. ఢిల్లీలో మోడీ తన ఇద్దరు మిత్రులకు దేశం మొత్తాన్ని రాసిచ్చేశారని మండిపడ్డారు. పోర్టులు, విమానాశ్రయాలు, టెలికాం, ఎల్ఐసీ ఇలా అన్నీ అమ్మేస్తున్నారని మండిపడ్డారు.

ధరణి పోర్టల్‌ను ప్రతిరోజు రాత్రి కేసీఆర్ చెక్ చేసుకుంటారని.. కమీషన్లు లేనిదే ఆయన కాంట్రాక్టులు చేయరని రాహుల్ గాంధీ వ్యాఖ్యానించారు. మోడీ పుణ్యమా అని.. రూ. 400 ఉన్న గ్యాస్ సిలిండర్ రూ.1200కి చేరిందన్నారు. డీజిల్, పెట్రోల్ ధరల పెరుగుదల వల్ల సామాన్యులు చితికిపోతున్నారన్నారు. చిన్న వ్యాపారులు లోన్ కావాలంటే బ్యాంకులు ఇవ్వట్లేదని.. వేల కోట్లు ఎగ్గొట్టే వాళ్ళకి మాత్రం ఎలాంటి హామీ లేకుండా ఇచ్చేస్తారని ఆగ్రహించారు. హైదరాబాద్ ప్రజలు చూపిన ప్రేమ, ఉత్సాహం తాను ఎప్పటికీ మరువలేనన్నారు. దేశంలోనే హైదరాబాద్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ సిటీగా పేరుగాంచిందన్నారు. సంస్కృతి, సంప్రదాయం అనేవి.. తెలంగాణ డీఎన్ఏలోనే ఉన్నాయని కితాబిచ్చారు.