హైదరాబాద్ లో బోనాల సందడి నెలకొంది. నేడు భాగ్యనగరంలో ఆలయాలన్నీ సర్వాంగ సుందరంగా ముస్తాబయ్యాయి. తెలంగాణ సంస్కృతీ సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచిన మహంకాళి ఆషాఢ బోనాల నిర్వహణకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఈనేపథ్యంలో.. చరిత్రాత్మక హైదరాబాద్ లాల్‌దర్వాజా సింహవాహిని మాతా మహంకాళి ఆలయంలో తెల్లవారుజామున పూజల అనంతరం బోనాల సమర్పణతో వేడుకలు ఆరంభమయ్యాయి. భక్తులు అమ్మవారిని దర్శించుకునేందుకు భారీగా తరలివస్తున్నారు.
ఈనేపథ్యంలో ఇవాళ ఉదయం లాల్‌దర్వాజా సింహవాహిని మాతా మహంకాళి ఆలయానికి పీవీ సింధూ బోనంతో వెళ్లారు. సింహవాహిని మాతా మహంకాళి అమ్మవారికి బంగారు బోనం సమర్పించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. లాల్ దర్వాజ్ బోనాలకు రావడం సంతోషంగా ఉందని తెలిపారు. ప్రతి సంవత్సరం అమ్మవారిని దర్శించుకుంటానని అన్నారు. గత సంవత్సరం రాలేక పోయానని పేర్కొన్నారు. కోవిడ్ కారణంగా ఆలయానికి రాలేదని అన్నారు. ఈరోజు మళ్ళీ లండన్ వెళ్తున్నానని దీంతో ఇవాళ అమ్మవారికి బంగారు బోనం సమర్పించడం చాలా ఆనందంగా వుందని పేర్కొన్నారు సింధు. తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికి బోనాల జాతర శుభాకాంక్షలు తెలిపారు. ఈ బోనాల కార్యక్రమంలో.. మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, ఇంద్రకరణ్ రెడ్డి, మహమూద్ అలీ పాల్గొన్నారు.
Lal Darwaza Bonalu: సింహవాహిని అమ్మవారికి బంగారు బోనం సమర్పించిన పీవీ సింధు
