NTV Telugu Site icon

Puvvada Ajay : నిరుద్యోగ యువత ఆశల మీద కిషన్ రెడ్డి నీళ్లు చల్లారు

సహాయ మంత్రిగా ఉన్నప్పుడు కిషన్ రెడ్డి నిస్సహాయ ప్రకటన చేసినా అర్థం ఉందని, కానీ ఇప్పుడు కేంద్రమంత్రి హోదాలో ఉంది కూడా నిస్సహాయంగా ఉన్నారని మంతి పువ్వాడ అజయ్‌ విమర్శలు గుప్పించారు. బయ్యారం స్టీల్ ఫ్యాక్టరీ రాదని నిరుద్యోగ యువత ఆశల మీద కిషన్ రెడ్డి నీళ్లు చల్లారని ఆయన మండిపడ్డారు. బయ్యారంలో ఉక్కు నిల్వలు ఉన్నాయని జియోలజికల్ సర్వే ఆఫ్ ఇండియా నివేదిక ఇచ్చిందని ఆయన తెలిపారు. బయ్యారం స్టీల్ ఫ్యాక్టరీకి సంబంధించి కేంద్రంది ఉక్కు సంకల్పం కాదు… అది తుక్కు సంకల్పం అని ఆయన ఎద్దేవా చేశారు.

వైజాగ్‌లో ఉన్న ఉక్కు ఫ్యాక్టరీని కేంద్రం చంపుతోందని, ఇక బయ్యారం స్టీల్ ఫ్యాక్టరీని ఊపిరి పోసుకొక ముందే పీక నొక్కుతున్నారని ఆయన విమర్శించారు. బయ్యారం స్టీల్ ఫ్యాక్టరీ పై కిషన్ రెడ్డి కామెంట్స్ వెనక్కి తీసుకోవాలని ఆయన డిమాండ్‌ చేశారు. విభజన హామీల్లో ఉన్న ఏ ఒక్క దాన్ని కూడా కేంద్ర ప్రభుత్వం చేయలేదని ఆయన అన్నారు. కేంద్ర ప్రభుత్వం వెంటనే బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీని ఏర్పాటు చేయాలని ఆయన డిమాండ్‌ చేశారు.