NTV Telugu Site icon

Protocol: గవర్నర్‌ మేడారం టూర్.. ప్రొటోకాల్‌ వివాదం

మేడారంలో సమ్మక్క సారలమ్మ జాతరలో పాల్గొన్నారు తెలంగాణ గవర్నర్‌ తమిళిసై సౌందర్‌ రాజన్.. వనదేవతలను దర్శించుకున్న ఆమె.. గద్దెల వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించారు. నిలువెత్తు బంగారాన్ని సమర్పించారు.. ఇక, ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. వన దేవతలు సమ్మక్క సారలమ్మలను అతి పెద్ద గిరిజన జాతర మేడారంలో దర్శించుకుని, మొక్కులు చెల్లించుకోవడం సంతోషంగా ఉందన్నారు.. ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ స్ఫూర్తికి ఈ అతి గొప్ప ఆదివాసీ జాతర ఆదర్శంగా నిలుస్తుందని వెల్లడించారు.. తెలంగాణ ప్రజలంతా ఆరోగ్యంగా, సంతోషంగా ఉండాలని వనదేవతలను కోరుకున్నట్టు తెలిపారు.. అయితే, గవర్నర్‌ మేడారం పర్యటనలో ప్రొటోకాల్‌ వివాదం తెరపైకి వచ్చింది… గవర్నర్‌ తమిళిసై మేడారం మహా జాతరకు వస్తే.. కనీసం రిసీవ్‌ చేసుకోవడానికి కూడా మంత్రులు రాకపోవడంతో వివాదం మొదలైంది.. అప్పటి వరకు అక్కడే ఉన్న మంత్రులు.. గవర్నర్‌ వచ్చే సమయానికి అక్కడి నుంచి వెళ్లిపోయినట్టుగా చెబుతున్నారు. అయితే, హెలికాప్టర్‌లో కాకుండా వరంగల్ మీదుగా రోడ్డు మార్గాన ములుగు జిల్లాకు చేరుకున్న గవర్నర్ తమిళిసైకి స్థానిక ఎమ్మెల్యే సీతక్క స్వాగతం పలికారు.. కానీ, మంత్రులు లేకపోవడంతో ప్రొటోకాల్‌ రగడ మొదలైంది.

Read Also: Jagga Reddy Issue: రంగంలోకి రేవంత్‌రెడ్డి.. దొరకని జగ్గారెడ్డి..!