NTV Telugu Site icon

Statue Of Equality: నేడు హైదరాబాద్‌కు రాష్ట్రపతి.. ట్రాఫిక్‌ ఆంక్షలు విధింపు

హైదరాబాద్‌ శివారు ముచ్చింతల్‌లోని శ్రీరామనగరంలో రామానుజాచార్య సహస్రాబ్ది వేడుకలు వైభవంగా సాగుతున్నాయి.. ముచ్చింతల్‌కు వీఐపీల తాకిడి కొనసాగుతూనే ఉంది.. ఇప్పటికే ప్రధాని నరేంద్ర మోడీ, హోం మంత్రి అమిత్‌షా, ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, పలువురు కీలక నేతలు, సీఎంలు, కేంద్ర మంత్రులు ఈ వేడుకల్లో పాల్గొన్న విషయం తెలిసిందే కాగా.. ఇవాళ సమతామూర్తి కేంద్రానికి భారత రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ రాబోతున్నారు.. మధ్యాహ్నం 2.20 గంటలకు ప్రత్యేక విమానంలో బేగంపేట ఎయిర్‌పోర్ట్‌కు చేరుకోనున్నారు రాష్ట్రపతి.. బేగంపేట్‌లో రాష్ట్రపతికి గవర్నర్ తమిళసై, సీఎం కేసీఆర్‌ తదితరులు ఆహ్వానం పలకనున్నారు.

Read Also: Fraud: రూ.22,842 కోట్ల మోసం.. నివ్వెరపోయిన సీబీఐ..!

ఇక, మధ్యాహ్నం 3.30 గంటలకు మచ్చింతల్‌ చేరుకుంటారు రాష్ట్రపతి.. భద్రవేదిలోని మొదటి అంతస్తులో ఏర్పాటు చేసిన 120 కిలోల రామానుజాచార్యుల బంగారు విగ్రహ ఆవిష్కరించనున్నారు రామ్‌నాథ్ కోవింద్‌… ఆలయాలు, బృహాన్‌మూర్తి విగ్రహాన్ని సందర్శిస్తారు. సాయంత్రం 4 గంటలకు స్వర్ణమూర్తి విగ్రహాన్ని ఆవిష్కరిస్తారు. సాయంత్రం 5 గంటలకు వరకు ఉత్సవాల్లో పాల్గొననున్నారు.. ఇక, రాష్ట్రపతి పర్యటన దృష్ట్యా హైదరాబాద్, శంషాబాద్ పరిసరాల్లో భారీ బందోబస్తు ఏర్పాటు చేసిన పోలీసులు.. నగరంలో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. రాష్ట్రపతి భద్రతా, ట్రాఫిక్ కారణాల దృష్ట్యా ఆదివారం మధ్యాహ్నం 1 గంట నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు ముచ్చింతల్ శ్రీ రామానుజ జీయర్ ఆశ్రమం వైపు ఎవరూ రావద్దని విజ్ఞప్తి చేశారు పోలీసులు.. భద్రతా కారణాల దృష్ట్యా ఈ మార్గంలో ఎవరిని అనుమతించబోమని పేర్కొన్నారు. ఇక, ముచ్చింతల్‌ నుంచి రాజ్‌భవన్‌కు చేరుకోనున్నారు రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్.. రాత్రి రాజ్‌ భవన్‌లో బస చేయనున్న ఆయన.. రేపు ఉదయం 10 గంటలకు తిరిగి ఢిల్లీకి వెళ్లనున్నారు.