Site icon NTV Telugu

Ponnam Prabhakar : రక్షణ శాఖ మంత్రి రాజనాథ్ సింగ్ కు మంత్రి పొన్నం లేఖ

Ponnam

Ponnam

Ponnam Prabhakar : హైదరాబాద్ అభివృద్ధి కోసం రక్షణ శాఖ భూముల వినియోగంపై రాష్ట్ర ప్రభుత్వ తరపున ఇంచార్జి మంత్రి పొన్నం ప్రభాకర్ కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజనాథ్ సింగ్ కు లేఖ రాశారు. ఈ లేఖపై జీహెచ్‌ఎంసీ మేయర్ గద్వాల విజయలక్ష్మీ, రాజ్యసభ సభ్యుడు అనిల్‌కుమార్ యాదవ్, సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ సంతకాలు కూడా ఉన్నాయి.

మంత్రి పొన్నం తన లేఖలో రక్షణ శాఖ భూములను ప్రజా ప్రయోజనాల కోసం తెలంగాణ ప్రభుత్వానికి కేటాయించేందుకు కేంద్రం సానుకూలంగా ముందుకు రావడంపై ధన్యవాదాలు తెలిపారు. హైదరాబాద్–సికింద్రాబాద్ జంట నగరాలు వేగంగా అభివృద్ధి చెందుతున్న ఈ సమయంలో, మౌలిక సదుపాయాల విస్తరణకు రక్షణ భూములు కీలకంగా ఉపయోగపడతాయని ఆయన పేర్కొన్నారు.

అంతేకాక, కంటోన్మెంట్‌ నుంచి తెలంగాణ ప్రభుత్వానికి యూజర్ ఛార్జీల కింద సుమారు రూ.1,000 కోట్లు పెండింగ్‌లో ఉన్నాయని, వాటిని త్వరితగతిన విడుదల చేస్తే ప్రజా మౌలిక వసతులు, పౌర సేవలు మరింత మెరుగుపడతాయని తెలిపారు.

ప్రజా వినియోగం కోసం భూములను కేటాయించేందుకు కేంద్ర ప్రభుత్వం అంగీకరించినందుకు కృతజ్ఞతలు తెలిపిన ఆయన, భూమి అప్పగింపు ప్రక్రియను వేగవంతం చేయాలని కోరారు. నగరాభివృద్ధి, పౌర సౌకర్యాల కోసం జరుగుతున్న మౌలిక సదుపాయాలు, మొబిలిటీ ప్రాజెక్టులకు ఈ భూమార్పిడి అత్యవసరమని గుర్తు చేశారు.

అదే విధంగా, గత కొంతకాలంగా సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డు ఎన్నికలు జరగకపోవడంపై ఆందోళన వ్యక్తం చేస్తూ, ప్రజాస్వామ్య పరిరక్షణ దృష్ట్యా ఎన్నికలు త్వరితగతిన నిర్వహించాలంటూ రక్షణ మంత్రిని అభ్యర్థించారు.

హైదరాబాద్ అభివృద్ధి దిశలో రక్షణ శాఖ అవసరమైన చర్యలు తీసుకుంటుందనే విశ్వాసం తనకుందని మంత్రి పొన్నం ప్రభాకర్ లేఖలో పేర్కొన్నారు.

Exit mobile version