NTV Telugu Site icon

Police Corruption: పేకాట రాయుళ్ల పట్టివేతలో పోలీసుల చేతివాటం

Card Kmm

Card Kmm

రాష్ట్రంలో పేకాట క్లబ్బులను పూర్తిగా నిర్మూలిస్తామని సాక్ష్యాత్తూ ముఖ్యమంత్రి కేసీఆర్ బహిరంగ ప్రకటనలు చేస్తుంటే తెలంగాణ పోలీసులు మాత్రం పేకాట రాయుళ్లతో ఫ్రెండ్లీ పోలీసింగ్ చేస్తున్నారు. పట్టణాల్లో పేకాట క్లబ్బులు మూతపడడంతో బడాబాబులు గ్రామాల్లో మామిడితోటల్లోని ఫామ్ హౌస్ లను అడ్డాలుగా మార్చుకుంటున్నారు. పేకాట మీద దాడులు చేస్తున్నట్టు నటిస్తున్న పోలీసు అధికారులు కూడాతృణమో పణమో తీసుకుని వదిలిపెడుతున్నారు. పేకాట స్థావరాల్లో దొరికిన భారీమొత్తాన్ని పోలీసులు నొక్కేశారన్న ఆరోపణలు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో వినిపిస్తున్నాయి. దీంతో ఆ పోలీసు అధికారులకు ఉన్నతాధికారులు మెమోలు జారీ చేశారు.

పేకాటలో లక్షల్లో చేతులు మారుతున్నా చేష్టలుడిగి చూస్తూ కిమ్మనకుండా కూర్చుండిపోతున్నారు పోలీసులు. పేకాట స్థావరాలపై ఉక్కుపాదం మోపాల్సిన పోలీసులు మాకు రావాల్సిన వాటా మాకు ఇచ్చి మీరు ఏదైనా చేసుకోండి అని బంపరాఫర్ లు ఇస్తున్నారు పేకాట క్లబ్బుల నిర్వాహకులకు. అశ్వారావుపేట నియోజకవర్గ పరిధిలోని దమ్మపేట మండల వ్యాప్తంగా ఉన్న వ్యవసాయ క్షేత్రాలు క్రికెట్ బెట్టింగ్స్,పేకాటలకు స్థావరాలుగా మారుతున్నాయి. దమ్మపేట మండలంలోని ముష్టిబండ గ్రామ సమీపంలోని అధికార పార్టీకి సంబంధించిన ఓ కీలకనేత బామ్మర్ది ఫామ్ హౌస్ లో గత రెండు రోజుల క్రితం కృష్ణా,గుంటూరు జిల్లాలకు చెందిన కొందరు బడా వ్యాపారవేత్తలు మందు,విందులతో పాటు పేకాట ఆడుతుండగా అక్కడ ఫామ్ హౌస్ లో పనిచేసే ఒక వ్యక్తి అశ్వారావుపేట పోలీసులకు జీపీఎస్ లొకేషన్ పంపడంతో దమ్మపేట ఎస్సై శ్రావణ్ కుమార్ తో కలిసి అశ్వారావుపేట సర్కిల్ ఇన్ స్పెక్టర్ బంధం ఉపేంద్ర రావు రంగంలోకి దిగారు.తన సిబ్బందితో కలిసి సదరు ఫామ్ హౌస్ పై దాడి చేసి పేకాటరాయుళ్లను అదుపులోకి తీసుకున్నారు.

అనంతరం వారిని విచారించి ఎంతోకాలంగా పేకాట వ్యవహారం నడుస్తున్నట్టు నిర్ధారణ చేసుకున్న తర్వాత తమ పోలీస్ బుద్ధికి పనిచెప్పారు. పేకాట రాయుళ్లను అరెస్ట్ చేసి,అక్కడ దొరికిన నగదును సీజ్ చేయాల్సిన సదరు పోలీసు అధికారులు పేకాటరాయుళ్ళతో బేరసారాలకు దిగారు.సత్తుపల్లికి చెందిన ఓ క్రికెట్ బుకీ రంగంలోకి దిగి పోలీసులతో మధ్యవర్తిత్వం చేసి పేకాట రాయుళ్లపై కేసు నమోదు చేయకుండా ఉండేందుకు వారివద్ద నుండి 30 లక్షలు తీసుకున్నట్టు పక్కా సమాచారం.గొడవ సద్దుమణిగిందని పేకాట రాయుళ్లు సంబర పడుతున్న సమయంలో పులిమీద పుట్రలా అశ్వారావుపేట సర్కిల్ కి చెందిన మరో ఇద్దరు కానిస్టేబుల్స్ మళ్లీ ఫామ్ హౌస్ వద్దకు చేరుకుని అక్కడే పేకాడుతున్న గుంటూరుకి చెందిన పొగాకు వ్యాపారి వద్ద ఉన్న బ్యాగులోని 10 లక్షలు గుంజుకుని వెళ్లి అధికారులకు 6.50 లక్షలు ఇచ్చినట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.

ఈ వ్యవహారం ఉన్నతాధికారుల వద్ద కు చేరింది.పేకాట రాయుళ్ల వద్ద పోలీసు అధికారులు డబ్బులు నొక్కేశారని పిర్యాదుల మీద పిర్యాదులు వెళ్లాయి. దీంతో ఫిర్యాదులు అందుకున్న భద్రాద్రి కొత్తగూడెం ఎస్ పి సునీల్ దత్ విచారణకు ఆదేశించారు. అంతే కాదు ఇవ్వడంతో ఆగ్రహంతో రగిలిపోయిన పేకాట స్థావరం నిర్వాహకులు, స్థానిక ఎమ్మెల్యే, ఇద్దరు పోలీసు అధికారులకు మెమోలను కూడా జారీ చేశారు. అంతే కాకుండా శాఖా పరమైన విచారణ ఆదేశాలు జారీ చేశారు. దీంతో అధికారులు ఉలిక్కిపడ్డారు. జరిగిన ఘటనపై పోలీస్ ఉన్నతాధికారులు విచారణకు ఆదేశించారు.

 

Eid Mubarak: సోషల్ మీడియా లో సెలబ్రిటీల విషెస్