Police Arrests A Man At Shamshabad Airport: శంషాబాద్ ఎయిర్‌పోర్టులో ఓ అనుమానుతుడ్ని పోలీసులు అరెస్ట్ చేశారు. ఎయిర్ పోర్ట్‌లోని అరైవిల్ విలేజ్‌లో అఖీల్ సయ్యద్ అనే యువకుడు అనుమానంగా తిరుగుతూ కనిపించాడు. దీంతో.. ఇంటెలిజెన్స్ అధికారులు వెంటనే అతడ్ని అదుపులోకి తీసుకున్నారు. తొలుత అతడ్ని పరిశీలించగా.. ప్రయాణానికి సంబంధించి ఎలాంటి పత్రాలు లేకపోవడంతో అనుమానం వచ్చింది. ఎందుకు వచ్చావని ప్రశ్నిస్తే.. కేవలం ఎయిర్‌పోర్ట్‌ని చూడ్డానికి వచ్చానని సమాధానం ఇచ్చాడు.
ఆ తర్వాత పొంతనలేని సమాధానాలు చెప్పి, తప్పించుకునే ప్రయత్నం చేశాడు. కానీ.. అతని ఆటలు సాగలేదు. అదుపులోకి తీసుకొని విచారించగా.. ఈనెల 11వ తేదీ నుంచి అతడు ఎయిర్‌పోర్టులోనే తిరుగుతున్నట్టు తెలిసింది. అతడ్ని మహబూబ్ నగర్ జిల్లా మమ్మనూర్ వాసిగా గుర్తించారు. పూర్తి విచారణ కోసం స్థానిక ఆర్జీఐఏ పోలీసులకు ఇంటెలిజెన్స్ అధికారులు అప్పగించారు. అతడు ఎందుకు ఎయిర్‌పోర్టులో తిరుగుతున్నాడు? కేవలం ఎయిర్‌పోర్ట్ చూసేందుకు వచ్చాడా? లేకపోతే ఏదైనా కుట్రలో భాగంగా రెక్కీ నిర్వహిస్తున్నాడా? అనే కోణాల్లో పోలీసులు విచారణ చేపట్టారు.