NTV Telugu Site icon

Pocharam Srinivas Reddy: వచ్చే ఎన్నికల్లో ఎమ్మెల్యేగా పోటీ చేస్తా.. కేసీఆర్ అది జరగనివ్వరు

Pocharam Srinivas Reddy

Pocharam Srinivas Reddy

Pocharam Srinivas Reddy Says He Will Contest As MLA In Next Elections: కామారెడ్డి బీర్కూర్‌లో వివిధ అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్న స్పీకర్ పోచారం శ్రీనివాస రెడ్డి.. వచ్చే శాసనసభ ఎన్నికల్లో ఎమ్మెల్యేగా పోటీ చేస్తానని పేర్కొన్నారు. ఎల్లప్పుడూ సమీక్ష అవసరమని.. అప్పుడు తప్పొప్పులు, లోటుపాట్లు బయటకు వస్తాయని వివరించారు. ప్రజాప్రతినిధులు, నాయకుల్లో ఎవరు తప్పు చేసినా.. అది ప్రజల్లో వ్యతిరేకతకు దారి తీస్తుందన్నారు. మంచి చేస్తే ప్రజలు బ్రహ్మరథం పడతారని, తప్పు చేస్తే మాత్రం తరిమికొడతారని ఉద్ఘాటించారు. తప్పులు చేయకపోతే భయపడాల్సిన అవసరం లేదని.. ఎవరైనా అనవసర విమర్శలు చేస్తే సమర్థవంతంగా తిప్పికొట్టండని.. మీ వెనకే నేను ఉంటానని పిలుపునిచ్చారు. ఏకపక్ష నిర్ణయాలు మాత్రం తీసుకోవద్దని హితవు పలికారు.

ఇదే సమయంలో పోచారం శ్రీనివాస రెడ్డి కేంద్రంపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. కాంట్రాక్టులు పెట్టొద్దు, వడ్లు కొనద్దని కేంద్ర ప్రభుత్వం చేప్తోందని.. అదే జరిగితే కార్పొరేట్ వ్యవస్థలు వాలుతాయని అన్నారు. రైతులు తమ భూముల్లో తామే కూలీ చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని హెచ్చరించారు. అసలు కేంద్ర ప్రభుత్వం.. దేశానికి అన్నం పెట్టదలుచుకుందా? సున్నం పెట్టదలుచుకుందా? అని నిలదీశారు. రాబోయే రోజుల్లో ప్రమాదమైన పరిస్థితి రాబోతోందని సూచించిన ఆయన.. రైతులకు కనీస మద్దతు ధర రూ. 2000 లేకుండా, అప్పుడు కార్పొరేట్ వాళ్లకు రూ. 1000కే అమ్మాల్సి వస్తుందన్నారు. కేంద్ర ప్రభుత్వం వ్యవసాయ పొలాల్లో బోర్లకు మోటర్లు పెట్టమంటోందని.. అయితే కేంద్రం ఎన్ని చట్టాలు తీసుకొచ్చినా, కేసీఆర్ ఉన్నన్ని రోజులు అది జరగనివ్వరని పోచారం శ్రీనివాస రెడ్డి ధీమా వ్యక్తం చేశారు.