భారతీయ సైనిక దళాల నియామకాల్లో మార్పునకు కేంద్ర ప్రభుత్వం నిర్ణయంపై ఆర్మీ అభ్యర్థులు ఆందోళన చేపట్టారు. హైదరాబాద్ లోని సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ లో వద్ద ఆర్మీఅభ్యర్థులు ఆందోళన చేపట్టారు. దీంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. రైల్వే స్టేషన్ బయట ఉన్న ఆర్టీసీ బస్సులను ధ్వంసం చేశారు. అంతటితో ఆగకుండా రైల్వే స్టేషన్‌లోకి చొచ్చుకెళ్లిన ఫ్లాట్‌ఫారమ్ మీద ఉన్న రైళ్లపై కూడా రాళ్లు విసిరారు. ప్రయాణికులు భయంతో పరుగులు పెట్టారు. రైలు పట్టాల మధ్యలో నిప్పుపెట్టి ఆందోళన చేపట్టారు. జాతీయ జెండాలు చేత పట్టి కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. నిరసనకారులను పోలీసులు అదుపులోకి తీసుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఆర్మీఅభ్యర్థుల ఆందోళనతో అధికారులు రైళ్లను నిలిపివేశారు.
అయితే.. మే 29న భారతీయ సైనిక దళాల నియామకాల్లో విప్లవాత్మక మార్పునకు కేంద్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టిన విషయం తెలిసిందే. త్రివిధ దళాల్లో వేతనాలు, పింఛన్ల భారాన్ని తగ్గించుకోవడమే లక్ష్యంగా ఈ అగ్నిపథ్ సర్వీసును కేంద్రం తీసుకొచ్చింది. 2022-23 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి రక్షణ రంగ బడ్జెట్ రూ.5 లక్షల 25వేల 166కోట్లు. అందులో పెన్షన్ల వాటా రూ.లక్షా 19వేల 696 కోట్లు. రెవెన్యూ వ్యయం రూ.2 లక్షల 33వేల కోట్లుగా ఉంది. రక్షణ రంగానికి కేటాయించే వార్షిక బడ్జెట్‌లో దాదాపు సగానికి పైగా వేతనాలు, పింఛన్లకే సరిపోతోంది.
కాగా.. అగ్నిపథ్‌లో చేరి నాలుగేళ్లు సర్వీసు పూర్తి చేసుకున్న తర్వాత.. వారికి ఎలాంటి పింఛను సదుపాయం ఉండదు. ఈ నేపథ్యంలో రక్షణ శాఖకు కొంత మేర ఆర్థిక భారం తగ్గనుంది. మిగులు నిధులతో త్రివిధ దళాల ఆధునికీకరణకు వెసులుబాటు లభించనుంది. “సాయుధ దళాలను అధునికీకరించి, అత్యాధునిక సాంకేతికతతో అనుసంధానం చేయాల్సిన అవసరం ఉంది. ఇందుకోసం యువతను సైన్యంలో భాగం చేసుకోవాలి. అందుకోసం కొత్త విధానం ఉపయోగపడుతుంది”
10లక్షల ఉద్యోగాల ప్రకటనపై మోదీ సర్కారుపై కాంగ్రెస్ విమర్శనాస్త్రాలు సంధించింది. ఇంకా ఎంతకాలం ఈ మాటల గారడీ అని కాంగ్రెస్ ప్రధాన అధికార ప్రతినిధి రణదీప్ సూర్జేవాలా ఎద్దేవా చేసిన విషయం తెలిసిందే.. ఏటా రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తామని మోదీ హామీ ఇచ్చారని మండిపడ్డారు. ఆ లెక్క ప్రకారం ఇప్పటికి వరకు దేశంలో 16కోట్ల ఉద్యోగాల భర్తీ చేయాలన్నారు. 2024 నాటికి 10లక్షల ఉద్యోగాల భర్తీ చేస్తామని చెప్పడం ఎంత వరకు సమంజసమని నిలదీశారు. ప్రస్తుతం అరవై లక్షల పోస్టులు ఖాళీగా ఉన్నాయని, ముప్పై లక్షల ఉద్యోగాలు కేంద్ర శాఖల వద్దే ఉన్నాయని గుర్తుచేశారు.
https://www.youtube.com/watch?v=oNhnkAMnCds&feature=youtu.be
