Kishan Reddy : మోడీ ప్రభుత్వం ప్రజల ఆరోగ్యానికి అత్యధిక ప్రాధాన్యత ఇస్తోందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. జీవన విధానంలో వచ్చిన మార్పుల వల్ల చాలా మంది తెలియకుండానే అనారోగ్యానికి గురవుతున్నారని, ప్రతి 100 మందిలో 95 మంది డాక్టర్లను సంప్రదించాల్సిన పరిస్థితి ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. ఆదివారం ఆయన, గవర్నర్ జిష్ణు దేవ్ వర్మతో కలిసి ఉప్పల్ పారిశ్రామిక వాడలో ప్రధానమంత్రి భారతీయ జన ఔషధి పరియోజన తెలంగాణ మార్కెటింగ్, డిస్ట్రిబ్యూషన్ వేర్‌హౌజ్‌ను ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, పదవీ విరమణ చేసిన వారు పెన్షన్ మొత్తాన్ని వైద్య ఖర్చులకే వెచ్చించాల్సిన పరిస్థితి ఉందని, పేద , మధ్యతరగతి కుటుంబాలు కూడా అనారోగ్యం కలిగితే జీవితాంతం సంపాదించిన మొత్తాన్ని వైద్యం కోసమే ఖర్చు చేస్తున్నారని చెప్పారు.
మోడీ ప్రభుత్వం ప్రతి ఒక్కరికీ ఏటా రూ.5 లక్షల ఉచిత బీమా అందించే ఆయుష్మాన్ భారత్ పథకాన్ని విజయవంతంగా అమలు చేస్తోందని తెలిపారు. ఈ పథకం కింద 70 ఏళ్లకు పైబడిన సీనియర్ సిటిజన్లకు ఉచిత చికిత్స అందిస్తున్నామని, తెలంగాణలో బస్తీ దవాఖానల్లో వెల్‌నెస్ సెంటర్లు ప్రారంభించామని చెప్పారు. మందుల ధరలను 50%-90% తక్కువగా అందించే జన ఔషధి కేంద్రాలు ప్రజల వైద్య ఖర్చులను గణనీయంగా తగ్గిస్తున్నాయని వివరించారు.
నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించడంతో పాటు, జన ఔషధి కేంద్రాల ఏర్పాటుకు కేంద్రం భారీ సబ్సిడీ ఇస్తోందని పేర్కొన్నారు. గతంలో కేసీఆర్ ప్రభుత్వం ఆయుష్మాన్ భారత్ పథకాన్ని అమలు చేయకపోవడం తప్పు అని, ప్రస్తుతం సీఎం రేవంత్ రెడ్డి దీన్ని సమర్థంగా అమలు చేయాలని కోరారు.
AI replacing Keyboard and Mouse: ఐదేళ్ల తర్వాత మౌస్-కీబోర్డ్ అవసరమే ఉండదట.. మైక్రోసాఫ్ట్ సంచలనం
