Site icon NTV Telugu

Gurukulam : సిర్రెత్తిన సిబ్బంది.. అధికారిపై కక్షతో తాగునీటిలో పురుగుల మందు

School Water

School Water

Gurukulam : జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో జరిగిన ఘటన ఒక్కసారిగా విద్యా వర్గాలను, తల్లిదండ్రులను, ప్రజలను దిగ్భ్రాంతికి గురి చేసింది. విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దాల్సిన గురుకుల పాఠశాలలోనే కొందరు సిబ్బంది తమ కక్షసాధింపుకై తాగునీటిలోనే పురుగుల మందు కలపడం కలకలం రేపింది. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో పరిధిలోని ఒక గురుకుల పాఠశాలలో ఈ దారుణం జరిగింది. పాఠశాలలో ప్రత్యేక అధికారి (Special Officer) పట్ల కక్ష పెంచుకున్న నలుగురు సిబ్బంది ఆవేశపూరితంగా తాగునీటిలో పురుగుల మందు కలిపినట్టు ఆరోపణలు ఉన్నాయి. అరాచకానికి పాల్పడిన వారిలో ముగ్గురు ఉపాధ్యాయులు, ఒక వంటమనిషి ఉన్నట్లు అధికారులు ధృవీకరించారు. విద్యార్థుల ప్రాణాలను పణంగా పెట్టి, కేవలం వ్యక్తిగత విభేదాలకే ఇంతటి ఘోర చర్యకు పాల్పడటం అందరినీ షాక్‌కు గురి చేసింది.

KA Paul : సహస్ర కేసులో ఓ చట్టాన్ని తీసుకురావాలి

అదృష్టవశాత్తూ ఈ విషయం సకాలంలో వెలుగులోకి రావడంతో పెద్ద ప్రమాదం తప్పింది. విద్యార్థులు ఆ నీటిని తాగకముందే ఘటన బహిర్గతం కావడంతో ప్రాణనష్టం జరగలేదు. లేకపోతే వందలాది విద్యార్థుల ప్రాణాలు ప్రమాదంలో పడే అవకాశం ఉండేది. విషయం తెలుసుకున్న జిల్లా కలెక్టర్‌ తీవ్రంగా స్పందించారు. తాగునీటిలో పురుగుల మందు కలిపిన సిబ్బందిపై వెంటనే కఠిన చర్యలు తీసుకున్నారు. ముగ్గురు ఉపాధ్యాయులు, వంటమనిషిని సస్పెండ్ చేస్తూ ఆదేశాలు జారీ చేశారు. అలాగే, ఈ ఘటనపై విస్తృత దర్యాప్తు చేపట్టాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ఈ సంఘటనతో తల్లిదండ్రులు, స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పిల్లల్ని చదివించి మనిషి చేయాలనే ఆశతో గురుకుల పాఠశాలలో చేర్పిస్తే, అక్కడి సిబ్బందే ఇలా ప్రాణాలకు తెగబడటం భయానకమని అంటున్నారు. ఇలాంటి వారిపై కఠిన శిక్షలు విధించకపోతే భవిష్యత్తులో మరిన్ని ప్రమాదాలు జరుగుతాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

ఘటన వెలుగులోకి రాగానే గురుకుల పాఠశాలల్లో భద్రత, పర్యవేక్షణ పట్ల ప్రజల్లో సందేహాలు మొదలయ్యాయి. తాగునీరు, ఆహారం వంటి విషయాల్లో కనీస జాగ్రత్తలు తీసుకోకపోతే విద్యార్థుల ప్రాణాలు హరించబడతాయని, కఠిన నియమావళి అమలు చేయాలని డిమాండ్లు వినిపిస్తున్నాయి. “పిల్లలను భవిష్యత్తు కోసం హాస్టల్‌లో పెడతాం కానీ ఇలాంటి ఘటనలు వినిపిస్తే గుండె కణతలాడుతుంది. నిందితులపై కఠిన చర్యలు తీసి పాఠశాలల్లో భద్రతా చర్యలు పెంచాలి” అని తల్లిదండ్రులు కోరుతున్నారు.

Botsa Satyanarayana : విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేకరణను అడ్డుకుంటామన్న కూటమి నేతలు ఎటు పోయారు

Exit mobile version